ఖైరతాబాద్, మార్చి 9 : తాము మరణించినా అవయవదానంతో పలువురికి జీవనదానం చేశారు. జీవన్‌దాన్ ఇన్చార్జి నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన బండి సీలోన్ రాజు (30) ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 7న వాహనంలో వెళ్తుండగా, రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన రాజును హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా, చికిత్స అందిస్తున్న వైద్యులు 8న బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. కుటుంబ సభ్యులను కలిసిన జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టతను వివరించగా, అందుకు అంగీకరించారు. ఆయన శరీరం నుంచి గుండె, కాలేయం, రెండు మూత్రపిండాలు, కార్నియాలను సేకరించారు.
మరో ఘటనలో పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన బుద్దె పోషెట్టి (60) రైతు. ఈ నెల 4న ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా, 8న బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులకు అవయవదానం గొప్పతనాన్ని వివరించగా, వారు అందుకు ముందుకు వచ్చారు. పోశెట్టి శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, ఒక ఊపిరితిత్తిని సేకరించారు.