ఖమ్మం, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీపై ఉన్న మోజు, లేని ఫ్యూచర్‌సిటీపై ఉన్న ఆరాటం పేద విద్యార్థుల ఫ్యూచర్‌పై లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పువ్వాడ మాట్లాడుతూ ఏ దేశంలోనైనా విద్య, వైద్యం బాధ్యత ప్రభుత్వానిదేనని, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ పేద విద్యార్థుల చదువుకు అడ్డంకిగా మారిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారని అసెంబ్లీలో చెప్పిన ఘనత కేసీఆర్‌దని, అవి మంచి పథకాలు అయినందున కొనసాగిస్తామని చెప్పి మరీ కేసీఆర్ కొనసాగించారన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బరువుగా భావించకుండా చెల్లించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బాధ్యతగా చూస్తే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భారంగా చూస్తున్నదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.25 వేల కోట్లు ఇస్తే, రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం రూ.600 కోట్లు మాత్రమే అన్నారు. విద్యాశాఖను సీఎం రేవంత్‌రెడ్డి తన దగ్గర పెట్టుకొని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించేవరకు బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తున్నదని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య వల్ల చాలావరకు కళాశాలలు మూతపడిపోతున్నాయన్నారు. చదువు పట్ల ప్రేమ ఉన్నవారు విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. రేవంత్‌రెడ్డికి చదువు పట్ల ప్రేమ లేదని, ధ్యాసంతా కమీషన్ల మీదనే ఉందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్ నష్టపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
– ఎమ్మెల్సీ తాతా మధు
వేల పాఠశాలలు మూతపడుతున్నాయి.. గురుకులాలు గోస పడుతున్నాయి.. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం కలుషితమవుతున్నది.. యూనివర్సిటీ భూములు అమ్ముకుంటున్నారు.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బొంద పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి మండిపడ్డారు. రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఆయా పార్టీలు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. బీఆర్ఎస్ నేత ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ ఫీజులు విద్యార్థుల అకౌంట్లో వేస్తామని సీఎం చెబుతున్నారు.. పిల్లలు వెళ్లిపోయిన తర్వాత ఫీజులు ఎలా వసూలు చేయాలన్నారు.
కనీస పరిజ్ఞానం లేకుండా ప్రైవేట్ కళాశాలల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రావి శివరామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బొంతు రాంబాబు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేసే ఆలోచన రేవంత్ ప్రభుత్వం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిని గద్దె దింపితేనే పేద విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, ఉప్పల వెంకటరమణ, గిరిబాబు, వేణు, బొమ్మెర రామ్మూర్తి, ఇతర పార్టీల నాయకులు మీడగ రామారావు, ఆవుల అశోక్, రమేష్, కేవీ కృష్ణారావు, విద్యార్థి సంఘాల నాయకులు రామకృష్ణ, అశోక్, వెంకటేష్, సురేష్, బషీర్, శేఖర్, ఆజాద్, శ్రీనివాస్, రాకేష్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
-బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి