గంగాధర, ఆగస్టు 12 : ఎల్లంపల్లి ప్రాజెక్టు, నారాయణపూర్ రిజర్వాయర్‌పై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసత్యాలు మాట్లాడడం మానుకొని, నిజాలు మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హితవు పలికారు. బుధవారం గంగాధర మండలం మధురానగర్ వద్ద అసంపూర్తిగా ఉన్న నారాయణపూర్ కుడి కాలువను మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చొప్పదండి నియోజకవర్గంలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు. 2004లో నారాయణపూర్ రిజర్వాయర్‌ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించినా, తట్టెడు మట్టి తియ్యలేదని గుర్తు చేశారు.
2014లో కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 90 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. మధురానగర్ వద్ద బ్రిడ్జితో పాటు, రైల్వే లైన్ కింద బ్రిడ్జి నిర్మాణం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మంగపేట నిర్వాసితులకు రూ.14 కోట్ల పరిహారం అందించినట్లు తెలిపారు. నారాయణపూర్ నిర్వాసితులకు పరిహారం కోసం అవార్డు అయినా ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పరిహారం నిలిచిపోయిందన్నారు. చొప్పదండి నియోజకవర్గ రైతుల కన్నీళ్లు తూడుస్తానని మాట్లాడుతున్న ఎమ్మెల్యేకు నారాయణపూర్ గ్రామస్తుల కన్నీళ్లు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పరిహారంపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ గుండాలతో గ్రామస్తులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2012కు ముందే 90 శాతం పనులు పూర్తి చేస్తే నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిపై మధురానగర్ చౌరస్తాలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం అందించాలని, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, నాయకులు వేముల దామోదర్, రామిడి సురేందర్, ముకెర మల్లేశం, బొల్లాడి శ్రీనివాస్ రెడ్డి, పడ్లూరి ఆదిమల్లు, గడ్డం స్వామి, దోమకొండ మల్లయ్య, లింగాల దుర్గయ్య, ఆకుల మధుసూదన్, తూము మల్లారెడ్డి, సముద్రాల అజయ్ ఉన్నారు.