వైరాటౌన్, డిసెంబర్ 8 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ మోసం చేసిన కాంగ్రెస్కు పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. తాటిపూడి, గొల్లపూడి గ్రామాల్లో వైరా నియోజకవర్గ సీపీఎం కార్యదర్శి భూక్యా వీరభద్రంతో కలిసి సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాటిపూడిలో బీఆర్ఎస్, సీపీఎం, టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి బట్టా భద్రయ్యను గెలిపించాలని తాతా మధు కోరారు. గొల్లపూడిలో బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, జనసేన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి బాణాల వెంకటేశ్వర్లు గెలుపును కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. అష్ణగుర్తిలో సీపీఎం బలపరిచిన అభ్యర్థి కంచర్ల అనిత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో వాగ్దానాలు చేసి, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. అలాంటి పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్, సీపీఎం, టీడీపీ, బీజేపీ, జనసేన బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు కట్టా కృష్ణార్జున్రావు, వనమా విశ్వేశ్వరరావు, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, మద్దెల రవి, మాదినేని ప్రసాద్, వజినేపల్లి చక్రవర్తి, నూకల వాసు, మిట్టపల్లి సత్యంబాబు, ఏదునూరి శ్రీను, తాటిపూడి సర్పంచ్ అభ్యర్థి బాణాల వెంకటేశ్వర్లు, అష్ణగుర్తి సర్పంచ్ అభ్యర్థి కంచర్ల అనిత తదితరులు పాల్గొన్నారు.