క్షేత్రస్థాయిలో అన్ని పనులకూ అంగన్వాడీ టీచర్ల సేవలను వినియోగించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వారి రెక్కల కష్టానికి మాత్రం సరైన వేతనం ఇవ్వడం లేదు. మురిపిస్తూ మూడు నెలలు మాత్రమే ఉన్నతీకరణ వేతనాలను అందించిన ప్రభుత్వం.. తొమ్మిది నెలలుగా వారికి పాత జీతాలనే జమ చేస్తూ వారి శ్రమను దోచుకుంటోంది. మెయిన్ కేంద్రాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అంగన్వాడీలు.. మినీ కేంద్రాల జీతాలే పొందుతూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చివరికి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నా ఫలితం శూన్యంగానే మిగిలింది. దీంతో భద్రాద్రి జిల్లాలోని 626 మంది అంగన్వాడీ టీచర్ల కుటుంబాలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)
గ్రామస్థాయి పాలనలో ఏళ్లకేళ్లుగా అందుతున్న అంగన్వాడీ టీచర్ల సేవలను గత కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. అందుకు గుర్తింపుగా వారిని ఉన్నతీకరించాలని నిర్ణయించింది. అలాగే, అంగన్వాడీల సేవలను కూడా విస్తరించాలని సంకల్పించింది. ఇందుకుగాను మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రతిపాదనలు రూపొందించింది. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ సర్కారు దానిని అమలు చేయడంలో చేతులెత్తేసింది. జనవరిలో మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేసింది. పేరు కోసం మూడు నెలలపాటు ప్రధాన టీచర్ల వేతనాలు ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మళ్లీ పాత జీతాలనే ఇస్తోంది. దీంతో మెయిన్ టీచర్లయిన మినీ టీచర్లందరూ తొమ్మిది నెలలుగా సగం జీతాలతో సర్దుకోవాల్సి వస్తోంది. దీంతో ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోయింది. ఫలితంగా మళ్లీ మరోసారి రోడ్డెక్కేందుకు అంగన్వాడీలు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 1,434 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కొన్ని చోట్ల చిన్న గ్రామాలు, తండాల్లో పిల్లలు ఉన్నందున మినీ అంగన్వాడీ కేంద్రాలను కూడా గత కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తరువాత మారుతున్న జనాభా దృష్ట్యా మినీ సెంటర్లను కూడా మెయిన్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని తీర్మానించింది. అమలు చేసే క్రమంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. వచ్చీరాగానే ఈ ప్రతిపాదనను మూలనపడేసింది. ఆ తరువాత అంగన్వాడీ టీచర్ల పోరాటానికి స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేస్తూ జనవరిలో జీవో జారీ చేసింది. అప్పటి నుంచి మూడు నెలలపాటు మినీ టీచర్లకు కూడా మెయిన్ టీచర్ల వేతనాలు చెల్లించింది. ఆ తరువాత దానిని ఆ మూడు నెలల ముచ్చటగానే మిగిల్చింది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వలేదంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకూ తొమ్మిది నెలలపాటు మళ్లీ పాత వేతనాలనే అంటే మినీ అంగన్వాడీలకు ఇచ్చే వేతనాలే జమ చేస్తోంది.
జిల్లా వ్యాప్తంగా 626 మంది మినీ టీచర్లకు లబ్ధి చేకూరలేదు. మినీ టీచర్లకు రూ.7,500, మెయిన్ టీచర్లకు రూ.13,500 చొప్పున ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తోంది. 626 మంది మినీ టీచర్లు మెయిన్ టీచర్లుగా అప్‌గ్రేడ్ అయినందున వారికి కూడా నెలకు రూ.13,500 చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంది. కానీ తొమ్మిది నెలలుగా రూ.7,500 చొప్పునే వేతనాలు చెల్లిస్తూ వారి శ్రమను దోపిడీ చేస్తోంది. ఆయాల నియామకం కూడా లేకపోవడంతో అంగన్వాడీలే అన్ని పనులూ చక్కదిద్దుకోవాల్సి వస్తోంది. ఇటు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం వండి పెట్టడంతోపాటు ప్రభుత్వం అప్పగించిన మిగతా పనులనూ చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ఎన్నికల విధులు, సర్వే పనుల వల్ల ఆదివారమూ వారికి విశ్రాంతి లేకుండా పోతోంది.
మినీ అంగన్వాడీలుగా ఉన్న మమ్మల్ని మెయిన్ అంగన్వాడీలుగా ఎప్పుడో అప్‌గ్రేడ్ చేశారు. మొదటి మూడు నెలలు మాత్రమే మెయిన్ టీచర్లతో సమానమైన వేతనాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 9 నెలలుగా మినీ అంగన్వాడీల వేతనాలే ఇస్తున్నారు. పనిభారం ఎక్కువగా, వేతనం తక్కువగా ఉంటోంది.
-దేవి, అంగన్వాడీ టీచర్, లక్ష్మీదేవిపల్లి
కొత్త ప్రభుత్వంలో ఉపయోగం లేదు. అంగన్వాడీ టీచర్లపై చిన్నచూపు చూస్తున్నారు. అదనపు పనులన్నీ చేయిస్తున్నారు. వేతనాలు మాత్రం చాలా తక్కువగా ఇస్తున్నారు. మంత్రులకు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. మళ్లీ రోడ్డెక్కాల్సి వస్తుందని అనుకుంటున్నాం.
-జీ.పద్మ, అంగన్వాడీ టీచర్, సీఐటీయూ నాయకురాలు
మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లను ప్రభుత్వం మెయిన్ టీచర్లుగా అప్‌గ్రేడ్ చేసింది. వేతనాలది చిన్న సమస్య. ప్రత్యేక బడ్జెట్ ఇస్తున్నారు. దాని ప్రకారం వచ్చే నెల నుంచి మినీ టీచర్లకు కూడా మెయిన్ టీచర్లతో సమానమైన వేతనాలు వస్తాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
-స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమ అధికారి, భద్రాద్రి జిల్లా