ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 6 : బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు నయవంచనకు పాల్పడిందంటూ బహుజనులు మండిపడుతున్నారు. ఏకంగా తమ జనాభాను తగ్గించి చూపి తమను మోసం చేయాలని కుట్రపన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేదాకా ఊదరగొట్టిన కాంగ్రెస్.. తీరా ఇప్పుడు తమను ఊడ్చిపారేస్తోందని ధ్వజమెత్తుతున్నారు. తాము అధికారం చేపట్టగానే రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్లు తెస్తామని, వాటి ప్రకారం 42 శాతం కోటా కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మాట తప్పిందని మండిపడుతున్నారు.
శాసనసభ ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల పేరిట హామీలు, డిక్లరేషన్లు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారం చేపట్టి ఏడాది దాటినా ఆ హామీలపై మౌనం వహించిందని ఆరోపించారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ లబ్ధిపొందడం కోసం మళ్లీ కుట్రకు తెరతీసిందని దుయ్యబట్టారు. ఇందుకోసం హడావిడిగా కులగణన చేపట్టిందని, ఆ సర్వేనూ అసంపూర్ణంగా చేసిందని, దాని ప్రకారం బీసీల జనాభా తగ్గినట్లు చెబుతోందని మండిపడ్డారు. అయినా, ఏటికేడు పెరగాల్సిన జనాభా.. కేవలం బీసీల్లోనే ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు.
కేవలం బీసీలకు ద్రోహం చేసేందుకే తమ జనాభాను తగ్గించి చూపించిందని, ఓసీలకు మేలు చేసేందుకే వారి జనాభా పెరిగినట్లు చెబుతోందని ధ్వజమెత్తారు. పైగా రిజర్వేషన్ల విషయంలోనూ కొత్త నాటకం మొదలుపెట్టిందని దుయ్యబట్టారు. రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేశామని, ఆమోదం కోసం కేంద్రానికి పంపామని, కేంద్రం ఆమోదిస్తేనే రాజ్యాంగపరమైన చిక్కులు లేకుండా అమలు చేస్తామని చెబుతూ నెపాన్ని కేంద్రం మీదకు నెట్టి తమకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రోహం చేసిన కాంగ్రెస్‌కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పితీరుతామంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా బహుజనులు శపథం చేస్తున్నారు.
బీసీల జనాభాను తగ్గించి చూపించారు..
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన కులగణన సర్వే తప్పులతడకలా ఉంది. ఈ సర్వేలో బీసీల జనాభాను భారీగా తగ్గించి చూపించారు. ఇటీవల రెండు నెలలపాటు చేపట్టిన ఈ సర్వే వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. వాస్తవంగా గత కేసీఆర్ ప్రభుత్వం నాటి సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతానికంటే ఎక్కువగా ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మాత్రం 46 శాతంగానే నమోదైంది. ఇంత వ్యత్యాసం ఎలా ఉంటుంది? అదీగాక ఓసీల జనాభా ఒక్కసారిగా ఎలా పెరిగింది? మళ్లీ సర్వే చేసే వరకూ బీసీలమంతా ఉద్యమిస్తాం.
– రంగిశెట్టి కోటేశ్వరరావు, బీసీ సంఘం నాయకుడు, మధిర
బీసీలకు అన్యాయం చేసేందుకే సర్వే!
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన సర్వే మొత్తం తప్పులమయంగా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో బీసీల జనాభా గణనీయంగా తగ్గింది. అంటే ఇదే నివేదిక ఆమోదం పొందితే బీసీలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లను కచ్చితంగా అమలుచేయాలి. తమ ప్రభుత్వం రాగానే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఏకంగా బీసీ జనాభా శాతాన్ని గణనీయంగా తగ్గించింది. అంటే బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది. దీనిపై బీసీలమంతా ఐక్యంగా పోరాడుతాం.
-లింగిశెట్టి వెంకటేశ్వరావు, బీసీ సంక్షేమ సంఘం, అశ్వారావుపేట
పెరగాల్సిన జనాభా.. ఎలా తగ్గుతుంది?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన కులగణన సర్వే సమగ్రంగా లేదు. మరోసారి పూర్తిస్థాయిలో సర్వే చేస్తేనే జనాభా వివరాలు సమగ్రంగా ఉంటాయి. ఏటికేడు జనాభా సంఖ్య పెరగడమే తప్ప తగ్గదు కదా? మరీ రేవంత్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో బీసీలు మాత్రమే ఎలా తగ్గారు? కులగణన మొత్తం అసంపూర్ణంగా ఉన్నట్లు ఈ సర్వే గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. వంద శాతం సర్వేను పూర్తిచేయకుండానే గణాంకాలు వెల్లడించడం ఏమిటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం హడావిడిగా సర్వే నివేదికను ఆమోదించి బీసీలకు అన్యాయం చేస్తారా?
-పెద్దారపు నాగరాజు, బీసీ నాయకుడు, అన్నపురెడ్డిపల్లి
కులగణనలో శాస్త్రీయత లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, కులగణన సర్వేలో శాస్త్రీయత లేదు. బీసీల సంఖ్య గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. సర్వేమొత్తం తప్పులమయంగా ఉంది. ఈ అసమగ్ర సర్వేను ఏవిధంగా ప్రామాణికంగా తీసుకుంటారు? దీనిని తుది సర్వేగా భావిస్తే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఈ కులగణన సర్వేకు చాలామంది దూరంగా ఉన్నారు. కానీ సర్వే పూర్తయిందని ప్రభుత్వం చెబుతోంది. కొందరిని వదిలేసే చేసిన సర్వేలో సమగ్రత లోపించినట్లే కదా? శాస్త్రీయత లేని ఈ సర్వేను పక్కనబెట్టి మరోసారి సర్వే నిర్వహించాలి.
-భూపతి నరసింహారావు, బీఆర్ఎస్ నేత, బీసీ నాయకుడు, అన్నపురెడ్డిపల్లి
కులగణన పేరిట వంచన..
కులగణన పేరు చెప్పి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించింది. గత కేసీఆర్ ప్రభుత్వం 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న బీసీల సంఖ్య కంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో బీసీల సంఖ్య భారీగా తగ్గింది. గతంకంటే బీసీ సంఖ్య ఏకంగా పది శాతం తక్కువగా ఉందంటే ఈ కులగణన ఎంతటి వాస్తవదూరమే అర్థమవుతోంది. బీసీలను అణగదొక్కేందుకే రేవంత్‌రెడ్డి సర్కార్ ఈ కులగణనను తప్పులతడకగా చేపట్టింది. అయితే ఈ కులగణనతో బీసీలకు తీరని నష్టం కలుగుతుంది. అందుకని దీనిని వెనక్కు తీసుకోవాలి.
-యార్లగడ్డ శ్రీనివాసరావు, బీసీ సంఘం నాయకుడు, దమ్మపేట
హడావిడి సర్వేతో తప్పుడు లెక్కలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా బీసీల కులగణన చేసి తప్పుడు లెక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో 46 శాతంగా బీసీలు ఉన్నారని చెప్పడం తప్పుడు సర్వేకు నిదర్శనం. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 56 శాతంగా ఉన్న బీసీలు.. ఇప్పుడు పది శాతానికి తగ్గడం వెనుక కుట్ర దాగి ఉంది. గతంలో 6 శాతంగా ఉన్న ఓసీలు.. ప్రస్తుతం 15 శాతానికి పెరిగినట్లు చూపించడం సరికాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయం.
-ఖమ్మంపాటి రేణుక, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి, ఇల్లెందు
జనాభా తక్కువ చేసి చూపించడం సరికాదు..
రాష్ట్రంలో అధికంగా ఉన్న బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనలో తక్కువ చేసి చూపించడం సరికాదు. బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది అర్థమవుతుంది. దేశంలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.. గణాంకాలు చేస్తున్నాం.. అని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీల ప్రాధాన్యతను తగ్గేంచేందుకే కంకణం కట్టుకున్నట్లు తెలుస్తుంది.
-సిలివేరి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు
కాంగ్రెస్‌వన్నీ తప్పుడు లెక్కలు
బీసీలను వంచించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తప్పుడు లెక్కలు ప్రకటించింది. బీసీల కులగణన అంతా తప్పుల తడక. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 56 శాతంగా తేలిన బీసీలు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 46 శాతం ఎలా ఉంటారు? బీసీలకు అన్ని రకాలుగా ప్రయోజనాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలన్నీ బూటకం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ బుద్ధి చెప్పడం ఖాయం.
– గుంటి పుల్లయ్య, తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ బీసీ మండల నాయకుడు
కులగణన తప్పుల తడక
బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకలా ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వం చేపట్టిన సర్వేను డిబేట్లో పెట్టి మరీ పేపర్లు చించివేస్తూ కేసీఆర్ సర్వేను పొగిడారు. ఓట్ల సమయంలో బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కేంద్రానికి నివేదిక పంపుతామని చెప్పడం సిగ్గుచేటు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓటర్లు ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి. బీసీలకు అన్యాయం చేస్త్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు.
-ఆకోజు సునీల్‌కుమార్, బీఆర్ఎస్ మండల కన్వీనర్, భద్రాచలం