మణుగూరు టౌన్, అక్టోబర్ 10: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హెచ్చరించారు. మణుగూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన బీసీ వర్గాల హక్కులను కాపాడడం ప్రతీ తెలంగాణవాడి బాధ్యత అని, అయితే 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సీఎం ఆడిందంతా ఒక హైడ్రామా అని, ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు రాబట్టుకునేందుకు ఆడిన డ్రామా అని పేర్కొన్నారు. బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అన్ని బీసీ సంఘాలను ఏకం చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను అన్ని విధాల మోసం చేస్తోందని మండిపడ్డారు. అందులో భాగంగానే బీసీలను రిజర్వేషన్ల విషయంలో మోసం చేయాలని చూస్తోందని, ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే ఉద్యమాలు తప్పవని, బీసీల హక్కుల కోసం అవసరమైతే మళ్లీ ప్రజా పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీ వర్గాలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు అందరూ ఒకేతాటిపై నిలబడి 42 శాతం బీసీ రిజర్వేషన్లను కాపాడుకుందామని, ఇది బీసీల హక్కు, తెలంగాణ ఆత్మగౌరవం అని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు కుంటా లక్ష్మణ్, ముత్యం బాబు, పోసం నర్సింహారావు, వట్టం రాంబాబు, నూకారపు రమేశ్, ఎడ్ల శ్రీను, యాదగిరి గౌడ్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.