42 శాతం రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంపై బీసీలు భగ్గుమన్నారు. రిజర్వేషన్లన్నీ కలిపినా 50 శాతం సీలింగ్ దాటకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ జీవో 9 పేరిట ముఖ్యమంత్రి నాటకాలు ఆడారని, బీసీలను మాయ చేసేందుకు తెరతీశారని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్ల పేరు చెప్పి బీసీలకు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మోసాన్ని నిరసిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీసీలు, బీసీ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ సహా వివిధ పార్టీల నేతలు శుక్రవారం ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీసీలు, బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేకనే రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే కామారెడ్డి డిక్లరేషన్ పేరిట హామీలిచ్చిందని ఆరోపించారు. తీరా లబ్ధిపొందాక తన కుటిల బుద్ధిని చూపిందని దుయ్యబట్టారు. చివరికి, న్యాయస్థానంలో జీవో నంబర్ 9 నిలబడదని తెలిసి కూడా మాయమాటలతో బీసీలను వంచించిందని విమర్శించారు. బీసీలపై చిత్తశుద్ధి లేని సీఎం రేవంత్‌రెడ్డిని తదుపరి ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేశారు. ఇకపై ఎన్ని నాటకాలు ఆడినా కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం తేల్చిచెప్పారు.
-నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 10
పర్ణశాల/ మణుగూరు టౌన్/ బూర్గంపహాడ్/ భద్రాచలం/ ఆళ్ళపల్లి/ కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 10: దేశం, రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ కులాల హక్కులను కాలరాస్తే సహించేదిలేదని ఆయా బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. భద్రాచలం- చర్ల ప్రధాన రహదారిపై కేశంపట్నం వద్ద బీసీ ఐక్య కార్యాచరణ దుమ్ముగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నాయకులు వేముల వెంకటేశ్వరరావు, పుదోట సూరిబాబునాయుడు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే 42శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీల అభ్యున్నతి పట్టడం లేదని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయపరమైన చర్యలు చేపట్టి స్టేను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎంబడి అర్జున్‌రావు, ఉప్పు అశోక్, తంతరపల్లి వెంకటేశ్వరరావు, ఉప్పు ప్రసాద్, డి.లక్ష్మణ్, పసుపులేటి అబ్బాయి, బొందిల కొమరయ్య పాల్గొన్నారు. మణుగూరు అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు. బీసీలకు ప్రభుత్వం చెప్పిన విధంగా 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన సెంటర్లో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మహంకళి రామారావు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా 42శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా ఎన్నికలు వచ్చేసరికి జీవో9 జారీ చేసి చట్టబద్ధంగా వ్యవహరించకపోవడంతో హైకోర్టు స్టే విధించిందన్నారు.
దీంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి బెజ్జింకి కనకాచారి, పినపాక నియోజకవర్గ ఇన్చార్జి నిదానపల్లి బాలకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు చిప్పరాజు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు జమ్మి సాయిరాం, పిడుగు వంశీ, వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు పాల్గొన్నారు. భద్రాచలంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఆళ్ళపల్లి మండలంలోని ఆళ్ళపల్లి, మర్కోడు, అనంతోగు గ్రామాల్లో బీసీ సంఘం నాయకులు వ్యాపార సముదాయాలు బంద్ చేశారు.
పొదిల రాము, యాసారపు బాబు, జనార్దన్, రణం మల్లికార్జున్, శ్రావణ్, సతీష్, సద్గుణాచారి పాల్గొన్నారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘం నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దళిత, గిరిజన, బహుజనులందరూ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మల్లెల రామనాథం, తాండ్ర వెంకటేశ్వర్లు, అంకినీడు ప్రసాద్, భిక్షపతి, నాగయ్య, రామాచారి, లక్ష్మణ్, సర్వేశ్, తమ్మిశెట్టి నాగేంద్రబాబు, మూర్తి, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇల్లెందు, అక్టోబర్ 10: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని వంచించడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ అన్నారు. ఇల్లెందు జగదాంబ సెంటర్లోని దిండిగాల కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 60 ఏళ్లు అధికారంలో ఉండి.. బీసీలను ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగైనా నిర్వహిస్తాం.. అవసరమైతే పార్టీపరంగా ముందుకెళ్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు వెనుకకు తగ్గారని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ కాలం వెళ్లబుచ్చడానికి బీసీ డ్రామా ఆడుతుందన్నారు. బీసీలపై అంత ప్రేమ ఉంటే మంత్రి మండలిలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసి చూపించాలన్నారు. కాంగ్రెస్ నాయకుల చిత్తశుద్ధిని బీసీ కులాలు గమనిస్తున్నాయని, ప్రధానమంత్రి బీసీ అయినప్పటికీ వారికి న్యాయం చేయలేకపోవడం రాజకీయాల కోసమేనని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.రంగనాథ్, నాయకులు జబ్బార్, లలిత్‌కుమార్ పాసి, కడకంచి వీరస్వామి, పరికపల్లి రవి, మునిగంటి శివ తదితరులు పాల్గొన్నారు.
బీసీల రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే చందంగా ఉంది. 42 శాతం రిజర్వేషన్ అమలు చేయలేమనే విషయం తెలిసి కూడా మోసపూరిత జీవోలు తీసుకొచ్చి బీసీలను దగా చేశారు. బీసీల ఆగ్రహా జ్వాలలో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం ఖాయం. కులగణన సందర్భంగా జనాభాను 25 లక్షలు తకువ చేసి చూపి బీసీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చంపేసింది. బీసీలకు మంచి జరగాలనుకుంటే పార్లమెంటులో చట్టం చేసి.. 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల రిజర్వేషన్ల పెంపుదల సాధ్యమవుతుంది. రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోడీపై ఒత్తిడి పెంచడం ద్వారా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది.
-ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారనే విషయం అన్ని సర్వేలలో స్పష్టంగా తేలింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేకనే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధ్యం కాదనే విషయం తెలిసి కూడా బీసీలను మోసం చేశారు. కేంద్రం అంగీకరించకుండా 50 శాతం రిజర్వేషన్లు దాటే అవకాశమే లేదు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల కోసం ఏనాడూ పాటు పడలేదు. ఇప్పుడు సాధ్యం కాదనే విషయం రేవంత్‌రెడ్డికి తెలిసి కూడా బీసీలను మోసం చేయాలనే కుట్రలు చేయడం అత్యంత దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే జాతీయ నాయకులతో ఢిల్లీలోనే పోరాడాలి.
-ఆర్జేసీ కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నేత
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లు నటించి బీసీలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశాడు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డ్రామాలో మంత్రులు బాగా నటించారు. ఇది కోర్టులో నిలబడదనే విషయం తెలిసి కూడా బీసీల ఓట్ల కోసం హడావుడి జీవో తీసుకొచ్చారు. కాంగ్రెస్ సర్కారు అనుకున్నట్లే కోర్టు స్టే ఇచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. బీసీల ఆత్మ గౌరవంతో సర్కారు ఆటలాడుకుంటోంది.
-దొడ్డి తాతారావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్, చర్ల
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చట్టబద్ధత సాధించే విషయంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైంది. బీసీల హకులను రక్షించాల్సిన బాధ్యత ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బీసీల రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మోసం చేశాయి. వారి ద్వంద్వ వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటులో చట్టం ద్వారా కృషి చేయాలి. కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలను కలుపుకొని రాష్ర్టాన్ని సాధించారు. రిజర్వేషన్లపై అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకోవాలి. రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. కోర్టు తీర్పు తర్వాత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల హకులు, ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలి. బీసీల హకులు, గౌరవాన్ని రక్షించడంలో బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుంది.
బీసీల పట్ల ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తూతూమంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశాడు. స్థానిక సంస్థల్లో సింగిల్ డిజిట్ డిపాజిట్లు రాకుండా ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ కాలయాపన చేస్తున్నది. బీసీ రిజర్వేషన్ల జీవోలోనే అనేక లోపాలు ఉన్నాయి. బీసీల 42 శాతం రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింపజేసి చట్టం చేయాలి. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అందుకే ఎన్నికలు నిర్వహించాలంటే రేవంత్‌రెడ్డి భయం పట్టుకుంది.
బీసీల రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి బహిర్గతమైంది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా బీసీలను పట్టించుకోలేదు. మళ్లీ బీసీల్లో వ్యతిరేకత మొదలుకావడంతో అమలుకాని 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని చూసింది. అది రాజ్యాంగబద్ధంగా లేకపోవడంతో హైకోర్టు దానిపై స్టే ఇచ్చింది. దీంతో బీసీలు మరోసారి మోసపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. లేదంటే అందరం ఏకమై ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.
-ఆకోజు సునీల్, బీసీ ఐక్య వేదిక
కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో బీసీలను నమ్మించి మోసం చేస్తుంది. ఎన్నికల వాగ్ధానాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చినప్పటికీ రాజ్యాంగపరంగా అమలు కాకపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఎన్నో ఏళ్లుగా బీసీలకు పూర్తిస్థాయి రిజర్వేషన్లు అమలవుతాయని ఆశించిన్పటికీ అనుమతులు సాధించడంలో సర్కారు విఫలమైంది. దీనిపై ఇతర పార్టీల నాయకులపై విమర్శలు చేయడం సరికాదు.
-బంధం నాగేశ్వరరావు, గీత పనివారల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, మధిర
కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేకనే 42 శాతం రిజర్వేషన్ అంటూ బీసీ వర్గాలను మోసం చేస్తున్నది. 420 హామీల తరహాలోనే 42 శాతం రిజర్వేషన్లపై కూడా కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నది. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో కొట్లాడకుండా.. ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నది. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను 22 నెలలుగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయం.
-లకావత్ గిరిబాబు, బీఆర్ఎస్ నాయకుడు, జూలూరుపాడు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే ఉద్దేశంతో కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లపై నాటకాలు ఆడుతున్నది. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే పరువు పోతుందనే ఉద్దేశంతో డ్రామాలు ఆడుతున్నది. రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదం లేకుండా బీసీ రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్లినట్లు ప్రజలను మభ్యపెడుతున్నది. హైకోర్టు ఎన్నికలపై స్టే విధించడంతో స్థానిక వర్గాలు పండుగ చేసుకుంటున్నాయి.
-పెద్దిరెడ్డి పురుషోత్తం, మాజీ సర్పంచ్, కొత్తూరు