భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, ఏప్రిల్ 6: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రగిరిలో భక్తులకు పాట్లు తప్పడం లేదు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వస్తున్నారని వారంరోజుల ముందునుంచే ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ
సతి సౌకర్యం లేకపోవడంతో బంధువుల ఇండ్ల వద్దనే ఉండాల్సి వచ్చింది. భద్రాచలంలో ఉన్న అన్ని లాడ్జీల్లో అధికశాతం గదులను అధికారులు యంత్రాంగానికి వినియోగించుకొని కొన్ని గదులను మాత్రమే లాడ్జీల యజమానులకు ఇచ్చారు. దీంతో యజమానులు ఇదే అదునుగా గదుల అద్దెలను అమాంతం పెంచేశారు. ఒక్కో డబుల్ బెడ్రూంకు పదివేలకు పైగానే అద్దె వసూళ్లు చేశారు. చాలామంది భక్తులు వేరే ప్రాంతాల్లో ఉండి కల్యాణాన్ని తిలకించడానికి భద్రాచలం రావాల్సి వచ్చింది.
సీతారాముల కల్యాణానికి ఈ సారి భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో అధికారులు వారికి నీడను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. సెక్టార్ల వెనుక భాగంలో చాలామంది భక్తులు ఎండలోనే కూర్చొని కల్యాణాన్ని తిలకించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపం నుంచి ఒకవైపు మాత్రమే టెంట్లు వేసి మిగతా ప్రాంతాల్లో వేయకపోవడంతో భక్తులు ఎండకు తట్టుకోలేకపోయారు. చివరివరకు ఉండలేక మధ్యలోనే ఇంటిముఖం పట్టారు. రహదారి చాలా ఇరుగ్గా ఉండటంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. అక్కడే అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడంతో తొక్కిసలాట జరిగిన ఆహార పదార్థాలను రోడ్లపైనే పడేసుకున్నారు.
కల్యాణానికి వచ్చిన భక్తులు ఎక్కువగా నాలుగుచక్రాల వాహనాలు తీసుకురావడంతో పార్కింగ్ స్థలాలను ఎప్పటిలాగే కేటాయించారు. దీంతో వాహనాల రద్దీ బాగా పెరిగింది. వాహనాలకు తగ్గట్టు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో భద్రాచలంలో ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా మారింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడుగంటల వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. బస్సుల కోసం భక్తులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది.
సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి షెడ్యూల్ ప్రకారం 11 గంటలకు మిథిలాస్టేడియానికి చేరుకోవాలి.. కానీ గంట ఆలస్యంగా రావడంతో అటు పోలీసులు ఇటు అధికార యంత్రాంగం ఎదురుచూడాల్సి వచ్చింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముందుగానే మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. సీఎం రామయ్య దర్శనానికి వెళ్లి కల్యాణమండపానికి వచ్చారు. సరిగ్గా అరగంట వరకు ఉన్న ఆయన కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఎటొచ్చి సీఎం వస్తున్నారని తెగ హడావుడి చేసిన అధికారులు భక్తులకు చుక్కలు చూపించారు.
భద్రాచలం రామయ్య కల్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్రనలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భక్తజనం భద్రాద్రికి రావడం ఆనవాయితీ. అయితే ఆదివారం జరిగిన శ్రీసీతారాముల కల్యాణం చూసే భాగ్యం వీఐపీలు, అధికారుల కుటుంబాల వారికే దక్కింది తప్ప రెండ్రోజుల ముందుగా వచ్చిన భక్తులకు దక్కకపోవడంతో అసహనానికి గురయ్యారు. అధికారగణం వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందనే వాదనలూ భక్తుల నుంచి వినిపించాయి. మిథిలా స్టేడియం చుట్టూ ఏర్పాటు చేసిన ఎల్ఈడీలు పనిచేయకపోవడంతో మరింత అసహనానికి గురయ్యారు. సీఎం రేవంత్రెడ్డి రావడంతో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించడంతో భక్తులు మండిపడ్డారు.