భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కదానికీ పక్కాగా అమలుచేయలేదని, ప్రభుత్వ పథకాలను అర్హులెవరికీ వర్తింపజేయలేదని విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’తో ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వంతఅమతతలు చేయాల్సిన ఎన్నికల హామీలను, పరిష్కరించాల్సిన ప్రజా సమస్యలను వినతిపత్రాల్లో పొందుపర్చామని అన్నారు. ఆ వినతులను పంచాయతీ కార్యాలయల్లోనూ, మండల కార్యాలయాల్లోనూ, మున్సిపల్ కార్యాలయాల్లోనూ అధికారులకు అందజేయనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ప్రజలు, రైతులుల సమస్యలపై ధర్నాలు చేయనున్నట్లు చెప్పారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, సైడు కాలువల్లో పేరుకపోయిన మురుగును తొలగించాలని, గ్రామాల్లో వీధిలైట్లు వేయించాలని, చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, అర్హులైన రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని, విత్తనాలు, ఎరువులు, విత్తనాలను సబ్సిడీపై అందించాలని, పోడు గిరిజనులపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు అందించనున్నట్లు చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, ఇల్లెందు నియోజకవర్గంలో జరిగే ధర్నాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆదివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.