భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు లేవని, కేసీఆర్ను చూసి ప్రజలు ఓట్లెయ్యాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 22, 60, 58, 55వ డివిజన్లతోపాటు కూలీలైన్, జీఆర్బస్తీలో ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 40శాతం సర్పంచులను గెలుచుకుని సత్తా చాటుకోవడంతో కాంగ్రెస్ మంత్రులు ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు. కేసీఆర్పై ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ నోటీసులు ఇచ్చి అభాసుపాలు చేయాలని చూశారన్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, కొత్తగూడెం కార్పొరేషన్లో గులాబీజెండా ఎగరడం ఖాయమన్నారు.
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గాన్ని మూడు వేల కోట్లతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క పనికూడా చేయలేదని, కార్పొరేషన్ అయ్యాక కాంగ్రెస్, సీపీఐ మేము తెచ్చామంటే మేము అని గప్పాలు కొట్టుకుంటున్నారని ఆరోపించారు. పంచాయతీలే కాదు మున్సిపల్ ఎన్నికలే కాదు వచ్చే ఎంపీటీసీలు, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, రాఘవేంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. సుజాతనగర్, పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో ఉదయం పదిగంటల నుంచి రాత్రి వరకు ఇంటింటి ప్రచారం చేస్తున్న నాయకులతో కలిసి అభిమానులు గులాబీ కండువాలు కప్పుకుని వెంట నడుస్తున్నారు. అభ్యర్థులు భీమా శ్రీవల్లి, శ్రీధర్, వేముల శివకృష్ణ, ఇమంది గణేష్, సుజాత, ముజ్జు, బండారి రజితతోపాటు మాజీ కౌన్సిలర్ లక్ష్మీబాయ్, చింతల కనకయ్య, అంబుల వేణుగోపాల్, రుక్మాంధర్ బండారి, రమాకాంత్, శ్రీకాంత్, సాదిక్పాషా, నవతన్ పాల్గొన్నారు.