వేంసూరు, నవంబర్ 23: ప్రజలను మభ్యపెట్టేందుకే ఆరు గ్యారెంటీ స్కీములంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. కాంగ్రెస్ హామీలను నమ్మితే ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎక్కువ ప్రమాదమని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సత్తుపల్లి నియోజకవర్గం సమగ్రాభివృద్ధిని సాధించిందని అన్నారు. ఇంతటి అభివృద్ధిని ఇక్కడి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. అందుకని నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసే తనకు ఓట్లు వేయాలని కోరారు. వేంసూరు మండలంలో గురువారం పర్యటించిన ఆయన.. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డితో కలిసి కల్లూరుగూడెం, మొద్దులగూడెం, బీరాపల్లి, రామన్నపాలెం, వైఎస్ బంజర, రాయుడుపాలెం, మర్లపాడు, లచ్చన్నగూడెం, భీమవరం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. 50 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమీ అభివృద్ధి చేయలేకపోయిందని విమర్శించారు. దానిని కప్పిపుచ్చుకునేందుకే అలవిగాని హామీలను ప్రకటిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరిందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు పథకం అందుతుందని అన్నారు. కాంగ్రెస్ మాటలను నమ్మవద్దని, కరెంట్ మోటర్ల వద్ద జాగారం చేసే రోజులు రానివ్వొద్దని సూచించారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రగతినగర్‌కు చెందిన కాలనీవాసులు పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరగా వారందరికీ ఎమ్మెల్యే సండ్ర గులాబీ కండువాలు కప్పారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పగుట్ల వెంకటేశ్వరరావు, గొర్ల సంజీవరెడ్డి, పాలా వెంకటరెడ్డి, పుచ్చకాయల శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.