కారేపల్లి, నవంబర్ 10 : తుఫాన్‌తో పంట పోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి వై.ప్రకాశ్ అన్నారు. సోమవారం కారేపల్లి మండలం పేరుపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ పత్తి, మొక్కజన్న, వరికి తీరని నష్టం కల్గించిందన్నారు. పత్తి పంట పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిందన్నారు. పంటలకు పెట్టిన పెట్టుబడులు రాని పరిస్ధితిలో రైతులు దిక్కుతోచని స్ధితిలో ఉన్నారన్నారు. కొద్ది పంట దిగుబడి తడిపోయి రంగు మారిందన్నారు. దెబ్బతిన్న పంట కొనుగోలుకు కొర్రీలు పెడుతున్నారని, దీంతో రైతులు అందోళన చెందుతున్నట్లు తెలిపారు.
ఈ పరిస్ధితిలో ప్రభుత్వం వెంటనే సర్వే చేసి రైతులకు పరిహారం అందించాలని కోరారు. పంటలకు బీమా సౌకర్యం కల్పించి ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడాలన్నారు. రైతాంగ సమస్యలపై ఈ నెల 13న ఖమ్మం కలెక్టరెట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ జిల్లా నాయకుడు కంచర్ల శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు అలెం గురవయ్య, చంద్రయ్య, సుగుణ, వై.జానకి, సత్యనారాయణ, చంద్రక్క, గురువమ్మ, కోరం గురవయ్య, రాంబాబు పాల్గొన్నారు.