భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : మరో ఐదు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ రెండు అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సర్కారు బడుల్లో ప్రవేశాలను పెంచేందుకు ఇప్పటికే ‘బడిబాట’ కార్యక్రమాన్ని ప్రభుత్వ పెద్దలు మొదలుపట్టారు. 19 వరకూ దానిని కొసాగించనున్నారు. ఇందులో పాఠ్యపుస్తకాలు మినహా రెండు ప్రధానమైన అంశాలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో అయోమయాన్ని పెంచుతున్నాయి.
అందులో ఒకటి రెండు జతల యూనిఫాం కాగా.. మరోటి మధ్యాహ్న భోజనం. ఒకవైపు అట్టహాసంగా బడిబాట కార్యక్రమం చేపట్టడం, మరోవైపు త్వరలోనే పాఠశాలలు పునఃప్రారంభించడం వంటివి జరుగుతున్నప్పటికీ ఆ సమయంలోగా రెండు జతల యూనిఫాం అందడం కష్టంగా కన్పిస్తోంది. ఇంకోవైపు మునుపటి మధ్యాహ్న భోజన బకాయిలే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవి చెల్లించకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ఆటంకం కలగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశం ప్రశ్నార్థకంగా ఉంది.
12న జిల్లాలో పాఠశాలలు ప్రారంభమైనా విద్యార్థులకు యూనిఫాం మాత్రం ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ యూనిఫాం మాత్రం నిర్ణీత సమయానికి అందే పరిస్థితి కన్పించడం లేదు. విద్యార్థుల యూనిఫాం స్టిచ్చింగ్ బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన వస్ర్తాన్ని ఆలస్యంగా అందజేసింది.
దీంతో వారి స్టిచ్చింగ్ ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది. ఆ ప్రభావం విద్యార్థులపై పడే ప్రమాదముంది. దీంతో విద్యార్థులకు తొలుత ఒక్కో జత మాత్రమే ఇచ్చి, తర్వాత మరో జత అందించే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులు కొన్ని రోజులపాటు ఒక్క జతతోనే సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. భద్రాద్రి జిల్లాలో 63,399 మంది విద్యార్థులున్నారు. ఇంతకొద్ది సమయంలో ఇంతమందికి యూనిఫాం అందించడం కష్టసాధ్యంగా కన్పిస్తోంది.

పాఠశాలలు తెరవక ముందే పాఠ్య, టెస్టు పుస్తకాలు సిద్ధంగా ఉండాలన్న విషయం మాత్రం విద్యార్థులకు కొద్దిగా ఉపశమనంగా అనిపిస్తోంది. ఇప్పటికే 5,06,080 పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరాయి. ఇంకా 10,920 పుస్తకాలు రావాల్సి ఉంది. 2వ తరగతి తెలుగు, 8వ తరగతి ఆంగ్లం పుస్తకాలు ఇంకా రాలేదని అధికారులు చెబుతున్నారు. 2,66,458 టెస్టు పుస్తకాలు కూడా గోదాముల నుంచి పాఠశాలలకు చేరాయి.
ఎన్నో వ్యయప్రయాసలతో నానా ఇబ్బందులు పడుతున్న మధ్యాహ్న భోజన వర్కర్లకు ప్రభుత్వం రూ.3 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు నెలలు తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో కార్మికులు నిత్యం ఒకవైపు పోరాటాలు చేస్తూనే మరోవైపు వంటలు చేస్తూ జీవనం వెళ్లదీసుకుంటున్నారు. గత ఏప్రిల్ వరకు ప్రాథమిక పాఠశాలల నుంచి రూ.96,36,264, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి రూ.56,15,025, ఉన్నత పాఠశాలల నుంచి రూ.47,62,525 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటితోపాటు మధ్యాహ్న భోజన వర్కర్లకు రూ.1.66 కోట్ల పారితోషికం బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. మరో ఐదు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున ఈలోపైనా వీరి బకాయిలు చెల్లిస్తారో.. లేదో.. చూడాలి. ఇప్పటికే అప్పులు చేసి మరీ మధ్యాహ్న భోజనం అందిస్తున్న వంట ఏజెన్సీల బాధ్యులకు ఈ బకాయిలు గుదిబండలా ఉన్నాయి.
ఇక ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కూడా సరేసరిగా కన్పిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం మొక్కుబడి తనిఖీలు చేస్తుండడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులను ఏటికేడు అదుపు లేకుండా పెంచుకుంటూ వెళ్తున్నాయి. నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో పేదలకు అందించాల్సిన ఉచిత విద్యను కూడా తుంగలో తొక్కేస్తున్నాయి. కేవలం ఫీజులకే పరిమితం కాకుండా ఏకంగా పాఠశాలల్లోనే దుకాణాలు పెట్టి పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర సామగ్రి వంటివన్నీ విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ తీరు చూస్తుంటే నియంత్రణ లేనట్లుగానే కన్పిస్తోంది.
మధ్యాహ్న భోజన పథకం బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. అన్ని తరగతులకు సంబంధించి పాఠ్య, నోట్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కళాశాల స్థాయి వరకు యూనిఫాంలు కుట్టించాం. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఒక జత దుస్తులు విద్యార్థులకు అందజేస్తాం. స్టిచ్చింగ్ పూరి కాగానే రెండో జత కూడా ఇస్తాం. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాం. ఎవరైనా నిబంధనలకు లోబడే ఫీజులు తీసుకోవాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వరాచారి, భద్రాద్రి డీఈవో