రైతులకు అవగాహన కారేపల్లి, ఫిబ్రవరి 18: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్(Collector Muzammil Khan) విస్తృతంగా పర్యటించారు. మండల పరిధిలోని చీమలపాడు, రేలకాయలపల్లిలో రైతులు సాగు చేస్తున్న పామ్ ఆయిల్, డ్రాగన్ ఫ్రూట్స్ తదితర పంటలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై పంటల సాగు విధానంలో కష్ట, నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. కోతుల వల్ల పండించిన పంట చేతికందక నష్టపోతున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
కోతుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. దీంతో స్పందించిన కలెక్టర్ సోలార్ పవర్ ద్వారా పంట చేను చుట్టూ విద్యుత్ ఖర్చులు సబ్సిడీ ద్వారా ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనను రూపొందించాలని సంబంధిత శాఖ సిబ్బంది ఆదేశించారు. అదేవిధంగా వివిధ రకాల సబ్సిడీలను రైతులకు ఇవ్వాలని కలెక్టర్ ను అడిగారు. పంటలు వేసే ముందు భూసార పరీక్షలు చేయించుకొని తెగుల్ల నివారణ, అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ రైతులకు సూచించారు.