ఖమ్మం, సెప్టెంబర్ 8: మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఆదివారం ఖమ్మం కాల్వొడ్డు, జూబ్లీక్లబ్, రజబ్అలీ పార్ ఏరియా, జూబ్లీపుర సహా మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించి బాధితులతో మాట్లాడారు. గతంలో లేనివిధంగా వర్షం బీభత్సం సృషించిందని, పలు కుటుంబాలకు ఆస్తి నష్టం అపారంగా జరిగిందని బాధితులను ఓదార్చారు.
ధైర్యంగా ఉండాలని, నష్టం వివరాల సేకరణ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందని చెప్పారు. మున్నేరు వరద బాధితుల సమగ్ర సమాచారం వేగవంతంగా ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు, రోడ్లు, సైడ్ కాలువలు, విద్యుత్ లైన్లు, వివిధ మౌలిక సదుపాయాలను ప్రాథమిక అంచనాలతో తక్షణ మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు.
ముందస్తు ముప్పును గమనించి మున్నేరు పరీవాహక లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు రావాలని కోరుతూ ఇంటింటికీ తిరిగి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. అధికారులు, సిబ్బందికి మున్నేరు ముంపు ప్రాంతాల వాసులు సహకరించాలని కోరారు. రానున్న నాలుగైదు రోజులు వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, జర్వం, సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. కలెక్టర్ వెంట శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ ఉన్నారు.
ఖమ్మంరూరల్ మండలం రామ్లీల ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం, జలగంనగర్లోని మున్నేరు వరద ప్రదేశాల్లో కొనసాగుతున్న సహాయక పనులను కలెక్టర్ పర్యవేక్షించారు. భోజనం, తాగునీరు, అల్పాహారం, టీ అందిస్తున్నారా లేదా అని నిరాశ్రయులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు కల్పించిన వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు పునరావాస కేంద్రాలు కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ, డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో లత, డీఎల్పీవో రాంబాబు, ఖమ్మంరూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో కుమార్, ఎంఈవోలు శ్రీనివాసరావు, శ్యాంసన్, అధికారులు ఉన్నారు.