మామళ్లగూడెం, జనవరి 11 : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు తదితర అంశాలపై సంబంధిత జిల్లా అధికారులతో శనివారం సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి పై నాలుగు పథకాలు ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రతీ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వ్యవసాయ విస్తరణాధికారి, గ్రామస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇళ్లు, కాలనీలుగా మారిన భూములు, రియల్ ఎస్టేట్ లే అవుట్, రోడ్లుగా మారిన భూములు, వ్యవసాయానికి పనికి రాని అన్ని భూములను జాబితా నుంచి తొలగించి ప్రతీ ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున.. ఒక్కో విడతకు రూ.6 వేల చొప్పున రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించనున్నదని తెలిపారు. జిల్లాలో 20 రోజులు ఉపాధిహామీ కూలీలుగా పనిచేసిన కార్మికుల జాబితాను తీసుకుని ఆధార్ కార్డు ట్యాగ్ ప్రకారం పరిశీలిస్తూ భూమి లేని కుటుంబాలను ఎంపిక చేయాలని సూచించారు. అర్హుల జాబితాను గ్రామాలవారీగా సిద్ధం చేయాలని, ఆయా వివరాలను జిల్లా ఇన్చార్జి మంత్రికి అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో ఆశాలత, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, డీఎస్వో చందన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.