మామిళ్లగూడెం, అక్టోబర్ 28 : ప్రజలు సమర్పించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా వైరా మండలం రెబ్బవరానికి చెందిన శ్యామ్‌కుమార్, బోనకల్ మం డలం గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన తమ్మారపు సామ్రాజ్యం, చింతకాని మండలం సీతంపేటకు చెందిన వెగ్గళం సాహిత, ఎర్రుపాలెం మండలం సఖినవీడుకు చెందిన చిన్నం రత్తయ్య తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలు మాఫీ చేయాలని, వెంటనే రైతు భరోసా ఇవ్వాలని, సన్నరకంతోపాటు దొడ్డు రకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో రాజేశ్వరి, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో అరుణ తదితరులు పాల్గొన్నారు.