మామిళ్లగూడెం, ఆగస్టు 22: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలను అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ కోరారు. ‘నూతన రెవెన్యూ చట్టం-2024’ ముసాయిదాపై రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, నిపుణలతో కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు.
భూ సమస్యల పరిష్కారం కోసం నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. ఈ చట్టం రూపకల్పనలో ప్రజలను విస్తృతంగా భాగస్వామ్యం చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వర్క్‌షాపును నిర్వహించినట్లు చెప్పారు. భూ రికార్డుల నిర్వహణ మెరుగ్గా ఉండే విధంగా ముసాయిదా బిల్లుపై రైతు సంఘాల బాధ్యులు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, ప్రస్తుత, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు తదితరులు తమ సూచనలు అందించాలని కోరారు. డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీవోలు గణేశ్, రాజేందర్, కలెక్టరేట్ ఏవో అరుణ తదితరులు పాల్గొన్నారు.