Khammam | ఖమ్మం అర్బన్ : విద్యార్థులు బాగా చదివి సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగి, మరో నలుగురి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ స్థానిక శాంతినగర్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 47 మంది ప్రభుత్వ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు కోసం అవసరమైన శిక్షణ, పుస్తకాలు అందించేందుకు మలబార్ గోల్డ్ చారిటబుల్ సంస్థ వారు నగదు ప్రోత్సాహంగా 3 లక్షల 80 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారని, ఇందులో కొందరు ఆర్థికంగా స్థిరంగా ఉంటారని, కొందరు పేదరికంలో ఉంటారని, వారిని చూసి స్ఫూర్తి పొంది సమాజంలో అగ్రస్ధాయికి చేరుకునేందుకు బాగా చదువుకోవాలని అన్నారు. మన పుట్టుక, కులం, మతం, ప్రాంతం, చుట్టూ పరిస్థితులు మన చేతిలో ఉండవని, అందుబాటులో ఉన్న విద్యను మనం వినియోగించుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. చదువు వల్ల సమాజంలో మనకు గౌరవం లభిస్తుందని, ముఖ్యంగా ఆడపిల్లలకు విద్య అస్తిత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. మలబార్ సంస్థ సొంత ప్రాంతమైన కాలికట్ నుంచే తన భార్య కూడా వచ్చిందని, ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనతో అదే విధంగా మనమంతా ఇతరులతో కలిసి ఎదగాలని, ఎవరిని చిన్న చూపు చూడవద్దని కలెక్టర్ పిల్లలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరావు, అధ్యాపకులు పవన్, భరత్ కుమార్, రాణి, శ్రీనివాస్, కిరణ్, మలబార్ సంస్ధ జిల్లా హెడ్ విష్ణు, మేనేజర్ రామారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.