పెనుబల్లి, ఏప్రిల్ 28 : రైతులు విక్రయానికి తరలించిన ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేయాలని, వెనువెంటనే ఆ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. రామచంద్రరావు బంజర గ్రామంలో దుర్గా గ్రామ సమాఖ్య-ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సేకరించిన ధాన్యం లారీలకు లోడ్ చేసే ప్రక్రియ, రిజిస్టర్ల నమోదు, తేమ శాతం, గన్నీ బ్యాగుల లెక్కలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, ప్రతి కేంద్రంలో బోర్డు ఏర్పాటు చేసి ఇప్పటివరకు టార్పాలిన్ పట్టాలు, గన్నీ బ్యాగులు ఎన్ని ఉన్నాయో స్పష్టమైన వివరాలు ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతులతో ముచ్చటించారు. తేమ సరిగా వచ్చిన ధాన్యాన్ని రైతులు తీసుకొస్తే కిలో కూడా తరుగు లేకుండా పూర్తి ధర అందిస్తామని తెలిపారు.
ఇప్పటివరకు ఎంత ధాన్యం వచ్చింది? ఎంత మొత్తాన్ని మిల్లులకు పంపించారు? అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలింపు సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల సమస్య తలెత్తకుండా ముందుస్తు ప్రణాళికలు ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పెనుబల్లి తహసీల్దార్ గంటా ప్రతాప్‌రెడ్డి, ఎంపీవో ఉపేంద్రయ్య, వ్యవసాయ సహాయ సంచాలకులు నరేశ్, ఏపీఓ జ్యోతి ప్రసన్న, రైతులు, అధికారులు పాల్గొన్నారు.