సత్తుపల్లి, నవంబర్ 25 : ఎంత విస్తీర్ణంలో వరి సాగు చేశారు? దిగుబడి ఎంత వచ్చింది? కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే డబ్బులు సకాలంలో వస్తున్నాయా? అని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పలువురు రైతులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం తల్లాడ మండల కేంద్రంలోని వంగాపురం రోడ్డులో గల రైతు తమ్మిశెట్టి లక్ష్మీనర్సయ్యకు చెందిన పొలంలో వరి కోతలను పరిశీలించిన కలెక్టర్.. పొలం గట్టుపై కూర్చొని అక్కడి రైతులతో మాట్లాడారు.
సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరి కోత మిషన్పై కుర్చొని కోతలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రైస్ మిల్లర్ల దగ్గర ఏమైనా కోతలు పెడుతున్నారా? అధికారుల స్పందన ఎలా ఉంది? అని ఆరా తీశారు. తమిళనాడు నుంచి వచ్చిన వరికోత యంత్రం గంటకు ఎంత కోత కోస్తుంది? ఎన్ని డబ్బులు అవుతాయి? అని అడిగి తెలుసుకున్నారు. పొలం గట్లపై కూర్చొని రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ.. సాగునీటి వసతి ఎలా ఉంది? విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.
ధరణి సమస్యలు ఏమైనా ఉంటే.. కలెక్టరేట్లో ధరణి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, దరఖాస్తుల సమర్పణ విషయంలో అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తున్నదని, ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన చేస్తున్నామని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కలెక్టర్ రైతులకు సూచించారు. కలెక్టర్ వెంట తల్లాడ వ్యవసాయాధికారి తాజుద్దీన్, ఏఈవోలు మురళీకృష్ణ, సాయికుమార్, శివకుమార్, రైతులు ఉన్నారు.