మధిర, నవంబర్ 21 : చింతకాని మండలం పందిళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. సార్‌గా అవతారమెత్తారు. తరగతి గదులను కలియతిరుగుతూ వెళ్లిన ఆయన 6వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయురాలు ఇంగ్లిష్ బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులతో కలిసి పాఠం విన్నారు.
తర్వాత కలెక్టర్.. ఉపాధ్యాయుడిగా మారి స్వయంగా బోర్డుపై ఇంగ్లిష్ పాఠాన్ని, గ్రామర్‌ను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించారు. పుస్తకంలో ఉన్న పాఠ్యాంశాన్ని పిల్లలతో చదివిస్తూ.. వారి అనుమానాలు నివృత్తి చేస్తూ ముచ్చటించారు. ‘పాఠశాలలో ఇంకా ఏమేం వసతులు కావాలి? జీవితంలో ఎలాంటి ఉద్యోగం చేస్తారు? ఏం కావాలనుకుంటున్నారు? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిజిటల్ ల్యాబ్‌లో పిల్లలతో కలిసి కలెక్టర్ నేలపై కూర్చొని క్లాస్‌లు వీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే లక్ష్యాలను ఎంచుకుని ఆ దిశగా కష్టపడి చదవాలని, విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు, పాఠ్య, నోట్‌బుక్స్, నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 50 పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి కూరగాయలు పండిస్తున్నామని, వాటిని సంరక్షించే బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఆంగ్ల భాషలోనే మాట్లాడుకునే విధంగా ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.