బూర్గంపహాడ్, జూన్ 16: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే విశాల మానవత్వానికి రూపమిచ్చారు. ఆదివారం ఉదయం 10:15 గంటల సమయంలో కొత్తగూడెంలో భద్రాద్రి నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. భద్రాచలంలో ఐటీడీఏ పీవోగానూ అడిషనల్ చార్జ్ తీసుకున్నారు. అనంతరం తిరిగి కొత్తగూడెంలోని కలెక్టరేట్‌కు వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు బూర్గంపహడ్ మండలం సారపాక నుంచి అదే మండలంలోని మణుగూరు క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకుంటుండగా.. అక్కడ ఆటో, బైకు ఢీకొన్నాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా అక్కడే పడి ఉన్నారు. అయితే ఈ ప్రమాద ఘటనను చూసిన కలెక్టర్.. వెంటనే తన అధికారిక వాహనాన్ని నిలుపుదల చేయించారు. హుటాహుటిన అక్కడికి చేరుకొని క్షతగాత్రులను పరిశీలించారు. వారిలో ఒక్కొక్కరినీ తానే స్వయంగా పైకి లేపి సిబ్బంది సహాయంతో తన అధికారిక వాహనంలో ఎక్కించారు. నేరుగా భద్రాచలంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు నూతన కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు.