భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి ఉపాధి పథకం అమలు తీరు, ఆస్తి పన్ను వసూళ్ల పురోగతి, ధరణి, ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు తదితర అంశాలపై తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సంబంధిత అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూలీలకు ఉపాధి పనులు కల్పించేందుకు ఎక్కువ అవకాశం ఉన్న పనులపై దృష్టి సారించాలని, వంద రోజుల పనిదినాలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న ఫాం పాండ్స్, ఫీడర్ ఛానల్ పనులు, రోడ్డు ఫార్మేషన్, ట్రంచ్ వర్క్ పనులు, బౌండరీలు తదితరాలకు సంబంధించిన అంశాలపై క్లస్టర్ల వారీగా సమీక్షించారు.
జిల్లాలో ప్రయోగాత్మకంగా గ్రామాల అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసేలా గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకచోట ఇంకుడు గుంతలు తవ్వకాలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ధరణి, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే సత్వరమే పరిష్కరించి అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల ఎల్-1 జాబితాను శనివారంలోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి చేయాలన్నారు. సమీక్షలో డీఏవో బాబూరావు, డీపీవో చంద్రమౌళి, పీడీ హౌసింగ్ శంకర్, డీఈవో వెంకటేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.