కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యమని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు అమూల్యమైనవని అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హేమచంద్రాపురంలోని జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ‘ఫ్లాగ్ డే’ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు ముఖ్యతిథులుగా హాజరయ్యారు. పరేడ్ కమాండర్ లాల్ బాబు ఆధ్వర్యంలో సాయుధ దళ పోలీసుల నుంచి కలెక్టర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని అన్నారు. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే క్రమంలో ఎంతో పోలీసులు మంది పోరాడి అమరులయ్యారని, వారి త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు.
అనంతరం ఎస్పీ రోహిత్ రాజు మాట్లడుతూ.. 1959లో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిన రోజు ఇదేనని, ఈ క్రమంలో శత్రు సైన్యంతో పోరాడి పది మంది అసువులు బాసినందున వారిని స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. అదనపు ఎస్పీ సాయి మనోహర్, డీఎస్పీలు చంద్రబాను, రెహమాన్, మల్లయ్యస్వామి, రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, స్పెషల్ పార్టీ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.