పాల్వంచ, సెప్టెంబర్ 25 : పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. స్వచ్ఛతా హీ సేవా-2024 కార్యక్రమంలో భాగంగా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు చెత్త సేకరణ, రోడ్లను శుభ్రం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్, గ్లౌజులు ధరించాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు పారిశుధ్య సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. అనంతరం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్.. త్వరలో ప్రారంభించనున్న డయాలసిస్ సెంటర్ పనులను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఎంహెచ్వో భాస్కర్నాయక్, డీసీహెచ్ఎస్ రవిబాబు, మున్సిపల్ కమిషనర్ ఢాకునాయక్, తహసీల్దార్ వివేక్ తదితరులు ఉన్నారు.