భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ లక్ష్మీదేవిపల్లి, అక్టోబర్ 24: ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లావ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహించనున్న జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర జాతీయ ఆరోగ్య మిషన్ బృందం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను, ఆరోగ్య కేంద్రాల స్థితిగతులను స్వయంగా పరిశీలించేందుకు పలువురు సిబ్బందితో కలిసి శుక్రవారం పలు ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు.
రేగళ్ల పీహెచ్సీ, చాతకొండ పల్లె దవాఖాన, ఆయుష్మాన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ బృంద సభ్యులు.. ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది హాజరు, ఔషధ నిల్వలు, శుభ్రత, శానిటేషన్, టీకా కార్యక్రమాల పురోగతి, గర్భిణులు, శిశువులకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. ప్రసూతి గది, ఔషధ నిల్వల పట్టిక, ల్యాబ్, ఔట్ పేషెంట్, శానిటేషన్ విభాగం, పేషెంట్ వెయిటింగ్ హాల్స్‌ను కలియతిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పలు సూచనలు చేశారు. డీఎంహెచ్‌వో జయలక్ష్మి, ఎస్డీసీ పోగ్రాం ఆఫీసర్ మధువరణ్, రేగళ్ల పీహెచ్సీ వైద్యాధికారి స్వప్న, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.