భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. గతంలో భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగూడెం కార్పొరేషన్లో సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలు, అశ్వారావుపేట మున్సిపాలిటీలో మూడు పంచాయతీలు విలీనంకావడంతో మొత్తంగా 471 పంచాయతీలను అధికారులు ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టు తేల్చిచెప్పడంతో 46 జీవోను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. దీంతో పంచాయతీ అధికారులు రిజర్వేషన్ కసరత్తును పూర్తిచేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ సర్కారు మాట నీటమూటగానే మిగిలిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటికీ కూడా బీసీలకు సర్పంచ్‌లను కేటాయించకపోవడం గమనార్హం. దీంతో బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. పూర్తి ఏజెన్సీ జిల్లా అయినప్పటికీ అశ్వారావుపేట, బూర్గంపాడు, దమ్మపేట మండలాల్లో బీసీల ప్రాబల్యం ఎక్కువగానే ఉంది. కానీ అక్కడ కూడా ఒక్క స్థానం సైతం బీసీలకు దక్కకపోవడంతో బీసీ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. 2019 పంచాయతీ ఎన్నికల్లో 479 పంచాయతీలకు గాను ఎస్టీలకు 463, ఎస్సీలకు 5, జనరల్‌కు 11 స్థానాలు కేటాయించారు. ఈసారి జనరల్‌కు కేవలం 9 స్థానాలకే పరిమితం చేశారు. దీంతో బీసీలు, ఓసీలు ఆ తొమ్మిది స్థానాలకే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 471, ఎస్టీ జనరల్ 234, ఎస్టీ మహిళ 226, ఎస్సీ జనరల్ 2, జనరల్ 5, జనరల్ మహిళ 4 మందిని కేటాయించారు. అదేవిధంగా వార్డుమెంబర్ల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం వార్డులు 4,168 ఉండగా.. ఎస్టీ జనరల్ 1,420, ఎస్టీ మహిళ 1,228, ఎస్సీ జనరల్ 13, ఎస్సీ మహిళ 5, బీసీ జనరల్ 10, బీసీ మహిళ 7, జనరల్ 840, జనరల్ మహిళ 645 మందికి కేటాయించారు. ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు.