రామవరం, అక్టోబర్ 28: రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర కీలకం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం లోని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ఆయన కేంద్రంలో చేపడుతున్న నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులు, భూసార పరీక్షా కేంద్రం కార్యకలాపాలు, సమగ్ర వ్యవసాయ నమూనా యూనిట్లను సమీక్షించారు. కేంద్రంలోని పరిశోధన, శిక్షణా కార్యక్రమాలు, రైతు అవగాహన కార్యక్రమాలపై శాస్త్రవేత్తలతో చర్చించి, రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి. భరత్ జిల్లా వ్యాప్తంగా రైతులకు అందిస్తున్న సాంకేతిక మార్గదర్శకత, పంటల విస్తరణ కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వ పథకాల అనుసంధానం, శిక్షణా కార్యక్రమాలపై కలెక్టర్ కి సమగ్రంగా వివరించారు.
అనంతరం గిరిజన ఉపాధి పథకం (Tribal Sub Plan) కింద కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లందు మండలంలోని పోపెల్లి గ్రామానికి చెందిన రైతులతో ముచ్చటించి, పట్టుపురుగుల పెంపకం, విప్పపువ్వు సాగు, సమగ్ర వ్యవసాయం పద్ధతులు వంటి ఆధునిక వ్యవసాయ విధానాలపై వారికి అవగాహన కల్పించారు. రైతులు ఆధునిక పద్ధతులను అవలంబిస్తే పంటల దిగుబడి పెరుగుతుందని, ఆదాయం కూడా పెరుగుతుందని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..కృషి విజ్ఞాన కేంద్రాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రైతులకు శాస్త్రీయ అవగాహన, సాంకేతిక సహాయం, మరియు సమగ్ర వ్యవసాయ పద్ధతుల ప్రచారం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచడంలో ఈ కేంద్రాల పాత్ర అత్యంత ప్రాముఖ్యమైనది అని పేర్కొన్నారు.
తరువాత కలెక్టర్ కృషి విజ్ఞాన కేంద్రంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలు, విత్తనోత్పత్తి క్షేత్రాలు, మరియు రైతు మద్దతు సేవలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన భూసార పరిశీలన సదుపాయాలు విస్తరించాలి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంట రకాలను అభివృద్ధి చేయాలి, మరియు రైతులకు సాంకేతికత చేరే విధంగా డిజిటల్ అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ చేతులమీదుగా గిరిజన రైతులకు తార్పాలిన్లు మరియు వ్యవసాయ ఉపయోగ సామగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమం లో శాస్త్రవేతలు డాక్టర్. హేమ శరత్ చంద్ర మరియు బి. శివ, రైతులు సంబధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.