భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలికి జరగనున్న ఎన్నికల కోసం పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల ఓటు హక్కు నమోదుపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నవంబర్-2020 వరకు డిగ్రీ లేదా ఏదేని తత్సమాన విద్యార్హతలలో పట్టభద్రులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 7,486 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని, 2021 పట్టభద్రుల ఎన్నికల్లో 42,679 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని అన్నారు.
ఓటు హక్కు నమోదుకు ఫారం-18 ద్వారా అన్ని తహసీల్దార్ కార్యాలయాలు, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి కూడా అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఓటు హక్కు నమోదుకు ఫిబ్రవరి 6 చివరి తేదీ అని చెప్పారు. తుది జాబితాను ఏప్రిల్ 4వ తేదీన ప్రకటిస్తామని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీపీఆర్వో శ్రీనివాస్, ఎన్నికల విభాగం తహసీల్దార్ దారా ప్రసాద్, నాయబ్ తహసీల్దార్ రంగా ప్రసాద్, సిబ్బంది నవీన్ పాల్గొన్నారు.