భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీలోని మీడియా కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో తాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఎండలకు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్నందున రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మున్ముందు ఏయే ప్రాంతాల్లో ఎంత మేర నీటి లభ్యత ఉంటుందో గుర్తించి కార్యాచరణ చేపట్టాలన్నారు. బోర్ల మరమ్మతు, ఫ్లషింగ్లు చేయాలని, ప్రైవేట్ బావులను లీజుకు తీసుకొనే చర్యలు చేపట్టాలన్నారు.
తాగునీటి సరఫరా విషయమై మంజూరు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. బోర్వెల్ ఆపరేటర్లు అనుమతి లేకుండా ప్రైవేట్ బోర్లు వేస్తే వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త బోర్ల మంజూరుపై నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. గత ఏడాది నీటి ఎద్దడిని ఎదుర్కొన్న గ్రామాల్లో సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మిషన్ భగీరథ ఏఈలు క్షేత్రస్థాయిలో తిరిగి తాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేయాలన్నారు. తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత పూర్తి బాధ్యత కార్యదర్శులదేనని అన్నారు. సమావేశంలో డీఆర్డీవో విద్యాచందన, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, ఇన్చార్జి డీపీవో సుధీర్‌కుమార్, అన్ని మండలాల మిషనర్ భగీరథ డీఈలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.