ఖమ్మం అర్బన్, మే 13: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను తీర్చిదిద్దుతూ వారి జీవితాలను బాగు చేసే సువర్ణవకాశం టీచర్లకు లభించిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. ఖమ్మంలోని హార్వెస్ట్ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన వేసవి శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించి మాట్లాడారు. విద్యాశాఖలో ఒకేరోజు మార్పుసాధ్యం కాదని, నిర్విరామంగా ప్రయత్నం జరుగుతూ ఉండాలని అన్నారు. భారతదేశంలో యువతకు మంచి విద్యా నైపుణ్యం అందించగలిగితే వారు సూపర్‌పవర్‌గా ఎదుగుతారని అన్నారు. వేల ఏళ్లుగా ఉన్న అసమానతలను విద్య ద్వారానే తగ్గించే అవకాశం ఉందని, విద్య ద్వారా జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు. తాను 7వ తరగతి చదివే సమయంలో విజయలక్ష్మి అనే టీచర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగానే తాను ఐఏఎస్ అధికారి స్థాయికి ఎదగగలిగానని అన్నారు.
కాగా, మొదటి విడతలో ఈ నెల 13 నుంచి 17 వరకు ఎన్రిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ స్కిల్స్, లెర్నింగ్ అవుట్‌కమ్స్ వంటి అంశాలపై 453 మంది గణిత ఉపాధ్యాయులకు, 436 సోషల్ టీచర్లకు, 326 మంది ఇంగ్లీష్ టీచర్లకు, 168 మంది ఎంఆర్పీలు, 62 మంది ఐఆర్పీలు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో డీఈవో సామినేని సత్యనారాయణ, ఏఎంవో రవికుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, సీఎంవో రాజశేఖర్, ఖమ్మం అర్బన్ ఎంఈవో శైలజాలక్ష్మి, హార్వెస్ట్ కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, మే 13: ఇందిరా మహిళా డెయిరీ కింద జూలై 15 తరువాత ప్రతీ వారం 250 పాడి పశువుల యూనిట్లు గ్రౌండ్ చేసేలా ప్రణాళిక రూపకల్పన చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సంబంధిత అధికారులతో ఖమ్మంలోని త క్యాంపు కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పశువుల కోనుగోలు ప్రక్రియను వర్షాకాలంలో ప్రారంభించాలన్నారు. జూలై 15 నుంచి జనవరి వరకు 5 వేల యూనిట్ల పాడి పశువులను గ్రౌండింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందిరా డెయిరీ సభ్యత్వం ఉన్న మహిళల్లో అనుభవం ఉన్న పాడి రైతులను గుర్తించినట్లు చెప్పారు.
పాడి పశువుల ఆరోగ్య పరిస్థితిని ముందుగానే పరీక్షించాలని, ప్రతి పశువుకూ ఆర్ఎఫ్ఐడీ ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. పశువులకు మేత కొరత రాకుండా నిరుపయోగంగా ఉన్న అసైన్డ్ భూములను గుర్తించి మేతకు గడ్డి పెంపకానికి వినియోగించాలని సూచించారు. పేద, బలహీన వర్గాలకు దీని ద్వారా ఆదాయం లభిస్తుందన్నారు. పశువుల బీమా, రవాణా ఖర్చు ఎంత అవుతుందో పరిశీలించి వివరాలు అందించాలని ఆదేశించారు. పాల ఉత్పత్తి వ్యాపారం, పశువుల సంరక్షణపై ఏపీఎం, డీపీఎంలు సంబంధిత ఎంపీడీవోలకు అవసరమైన శిక్షణ అందించాలని, వారంలో వీటిని ప్రారంభించాలని సూచించారు. డీఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు జ్యోతి, నవీన్‌బాబు, పురందర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.