కారేపల్లి (కామేపల్లి), డిసెంబర్ 13 : రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కామేపల్లి మండల కేంద్రంలో గల పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, ఈ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఉద్యోగి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికల సామగ్రిని ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాలెట్ పంపిణీ, స్వీకరణ జరగాలన్నారు. ప్రతి బండిల్పై సీల్, సంతకాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ఎన్నికల సామాగ్రి సరఫరా వ్యవస్థ,రిసెప్షన్ రూమ్ కార్యకలాపాలను పరిశీలించారు.
సామగ్రి పంపిణీ సమయంలో ప్రతి పోలింగ్ బృందానికి అవసరమైన సామగ్రిని సమయానికి అందించేందుకు ప్రత్యేక డెస్కులు ఏర్పాటు చేయాలన్నారు. బృందాలు వచ్చిన క్రమానుసారం రిజిస్ట్రేషన్ నుంచి మెటీరియల్ పంపిణీ వరకూ మార్గదర్శకాలు పాటించాలన్నారు. ఎక్కడ ఆలసత్వం, అయోమయం తలెత్తకుండా తగిన సూచిక బోర్డులు, సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా భద్రత, సీసీ కెమెరా పర్యవేక్షణ, పోలింగ్ సిబ్బందికి త్రాగునీరు, విశ్రాంతి గదులు, వైద్య అత్యవసర సదుపాయాల లభ్యతను అడిగి తెలుసుకున్నారు.