మామిళ్లగూడెం, సెప్టెంబర్ 19: జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన చేపట్టేందుకు పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకం కోసం చేపట్టాల్సిన భూసేకరణ, పనుల పురోగతి అంశాలపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్లతో కలిసి ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్టు శాఖల అధికారులతో ఖమ్మం కలెక్టరేట్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ ఎస్ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ముఖ్యమైన సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు అటవీ సమస్యల వల్ల భూసేకరణ వేగంగా జరగడం లేదని అన్నారు. పనులు ఆలస్యం కావడానికి గల ముఖ్య కారణాలపై ఫోకస్ పెట్టాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పనులు వేగవంతం చేయాలని సూచించారు. భూ సేకరణకు సంబంధించి చెల్లింపులను డిప్యూటీ సీఎం, మంత్రుల సహకారంతో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
పథకానికి సంబంధించి జిల్లా నుంచి 507 ఎకరాల అటవీ భూమికి బదులుగా ప్రత్యామ్నాయ భూముల కేటాయించాలన్నారు. ప్యాకేజీ 13 పరిధిలో చేపట్టనున్న 10 కిలోమీటర్ల కాలువ నిర్మాణానికి అవసరమైన 167 ఎకరాల పట్టా భూములకు అవార్డు పాస్ చేసి నెల రోజుల్లోపు భూ బదలాయింపు పూర్తి చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల భూసేకరణ సర్వే పనుల నిమిత్తం సర్వేయర్లను డిప్యూటేషన్‌పై తీసుకొని రావాలన్నారు. అదనపు బృందాలు ఏర్పాటు చేసి సర్వేను 20 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ పథకానికి సంబంధించిన పనుల పురోగతిపై ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామన్నారు. ఇరిగేషన్ కొత్తగూడెం, ఖమ్మం ఎస్ఈలు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, నీటిపారుదల, ఫారెస్టు శాఖల అధికారులు పాల్గొన్నారు.