మామిళ్లగూడెం, డిసెంబర్ 8: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. స్వేచ్ఛాయుత , న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత మండలాల అధికారులతో కలెక్టరేట్ నుంచి సోమవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ (టీసీ)లో ఆయన మాట్లాడారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున రానున్న 8 రోజులపాటు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు సంబంధిత మండలంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు రిటర్నింగ్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆదేశించారు. రిజర్వు పోలింగ్ బృందాలు తప్పనిసరిగా విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజున పూర్తి స్థాయిలో రిజర్వు బృందాలు డీఆర్సీలో అందుబాటులో ఉండాలన్నారు. 992 పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఉల్లంఘనలు జరగకుండా ఎఫ్ఎస్టీ , ఎస్ఎస్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ను ఎంపీడీవోలకు విడుదల చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీజ, ఎన్నికల నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.