ఖమ్మం, అక్టోబర్ 24: ఖమ్మంలోని మున్నేరు నదిపై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పట్ల అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఖమ్మం నగరంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్.. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను, కాల్వొడ్డు తీగల వంతెన పనులను, మున్నేరు నిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న లేఔట్ వెంచర్ పురోగతి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. నిపుణుల కమిటీ చేసిన డిజైన్ల ప్రకారం మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం పకాగా జరగాలని, అది కూడా సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను అభివృద్ధి చేసి మున్నేరు రిటైనింగ్ వాల్ భూ నిర్వాసితులకు అందించేందుకు రైతులతో చర్చలు జరపాలని సూచించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నిమిత్తం.. రైతులకు, నిర్వాసితులకు అందించే 125 ఎకరాల ప్రత్యామ్నాయ భూముల లేఔట్ వెంచర్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అందులో అన్ని వసతలు కల్పించాలని ఆదేశించారు. ఆర్అండ్బీ ఎస్ఈ యాకుబ్, ఈఈ పవార్, ఆర్డీవో నరసింహారావు, ఇరిగేషన్ డీఈ రమేశ్‌రెడ్డి, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ తహసీల్దార్లు సైదులు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.