మామిళ్లగూడెం, ఏప్రిల్ 10 : రోడ్డు ప్రమాదాల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 16న మండల స్థాయిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని గ్రామసభల తరహాల్లో నిర్వహించాలని సూచించారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు పరిశభ్రంగా ఉంచాలని, శానిటేషన్‌ను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని తెలిపారు. ఉపయోగంలో లేని పాత ఫర్నిచర్, స్క్రాప్ వాహనాలను తొలగించాలని, ఫీల్డ్ సందర్శన సమయంలో ఇవి కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అరైవ్.. అలైవ్రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. ఖమ్మంజిల్లాలో 30 బ్లాక్ స్పాట్లు గుర్తించామని, అక్కడే 50శాతం కంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే ఈ బ్లాక్స్పాట్లను సరిచేయాలని ఆదేశించారు.
రాహ-వీర్, పీఎం రాహత్ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రైవేటు పాఠశాల బస్సులు, వాహనాల ఫిట్నెస్, డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని తప్పనిసరిగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆర్టీవోను ఆదేశించారు. రోడ్డు భద్రతపై గ్రామసభలను నిర్వహించాలని, డ్రైవర్లకు కంటి పరీక్ష శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో దీక్షారైనా, జిల్లా అధికారులు, ఇన్చార్జి ఆర్టీవో జేఎస్ శ్రీనివాసరావు, ఏఎంవీఐలు దినేష్, సుమలత, ఆర్టీఏ మెంబర్ వెంకన్న పాల్గొన్నారు.