మామిళ్లగూడెం, నవంబర్ 26: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 5,168 వార్డు సభ్యుల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో 7 మండలాల్లో 192 గ్రామపంచాయతీలు, 1,740 వార్డులకు, రెండో విడతలో 6 మండలాల్లో 183 గ్రామపంచాయతీలు, 1,686 వార్డులకు, మూడో విడతలో 7 మండలాల్లో 191 గ్రామపంచాయతీలు, 1,742 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అక్కడే ఉంటుందని పేర్కొన్నారు.
మొదటి విడత నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 27, రెండో విడతకు 30, మూడో విడతకు డిసెంబర్ 3న నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. మూడు రోజులపాటు స్వీకరించిన నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు, ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని, ఇప్పటికే 566 గ్రామపంచాయతీలలో రిజర్వేషన్లు కూడా ఖరారు చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 708 పోలింగ్ లొకేషన్స్‌లో 5,166 పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు 9,51, 000, వార్డు సభ్యులకు 9,51,000 బ్యాలెట్ పత్రాలు ముద్రణ చేసి సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్స్‌లు 5,746ని ఇప్పటికే మండల కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 13 మంది నోడల్ అధికారులు, స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు 191 మంది, స్టేజ్-1 సహాయ రిటర్నింగ్ అధికారులు 191 మంది, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు 566 మందిని నియమించామన్నారు.
సహాయ పోలింగ్ అధికారులు 3,442 మంది, ఓపీవోలు 4,217 మందిని, ఫ్లయింగ్ స్కాడ్స్ ఐదుగురు, స్టాటిక్స్ సర్వేలైన్స్ బృందాలు 15, టీఓటీలు 25, జోనల్ అధికారులు 76, రూట్ అధికారులు 241 మంది నియమించినట్లు పేర్కొన్నారు. 20 సెంటర్లలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 1,858 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నామని, దీనికి మైక్రో అబ్జర్వర్లుగా 648 మంది పనిచేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ఉల్లంఘన, ఇతర సమస్యలపై 1,077 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందకు పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, మీడియా, వివిధ వర్గాల ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.