 
                                                            ఖమ్మం, అక్టోబర్ 30 : ఎగువ నుంచి వచ్చే వరదతో మున్నేరు నదీ ప్రవాహం పెరుగుతున్నందున లోతట్టు, పరీవాహక ప్రాంతాల ప్రజలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం కాల్వొడ్డు వద్ద 25 అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వరద ప్రవాహాన్ని మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి కలెక్టర్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నేరు ప్రభావిత ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. ముంపు ప్రాంత ప్రజలను నివాసాల నుంచి ఖాళీ చేయించి ధంసలాపురం పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ, నయాబజార్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. అనంతరం నయాబజార్ సూల్, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. వరద బాధితులకు కల్పించిన వసతులు, భోజనం నాణ్యత, వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడి.. సమకూర్చిన సౌకర్యాలపై ఆరా తీశారు.
ప్రజలు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తుపాను వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో మున్నేరులో ఉధృతి పెరుగుతున్నదని, ఖమ్మం వద్ద 25 అడుగుల మేర ప్రవహిస్తున్నదని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో నీటిమట్టం అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వరద పెరిగినందున మున్నేరు పరిసరాలు, బ్రిడ్జిలపైకి ప్రజలు రావొద్దని, ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలందరూ జాగ్రత్తలు పా టించాలని కలెక్టర్ సూచించారు. డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఆర్డీవో నరసింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ అనిల్‌కుమార్, అర్బన్ తహసీల్దార్ సైదులు, మున్సిపల్, పోలీస్, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
                            