ఖమ్మం, అక్టోబర్ 29 : జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మొంథా తుపాను ప్రభావంతో మున్నేరు నది పరీవాహక ప్రాంతాలు కాల్వొడ్డు, మున్నేరు ఘూట్, గణేశ్ నిమజ్జన ఘూట్, బొకలగడ్డ, రూరల్ మండలం జలగం నగర్, కేబీఆర్ నగర్, గ్రీన్ కాకతీయ నగర్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ బుధవారం పర్యటించారు.
మున్నేరు బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని, నీటిమట్టం స్థాయిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బొకలగడ్డలో స్థానికులతో కలెక్టర్ ముచ్చటిస్తూ.. ఎగువ జిల్లాల నుంచి మున్నేరుకు వరద ఉధృతి పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని, అధికారులకు సహకరిస్తూ.. వరదను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం వద్ద మున్నేరు వాగు 19 అడుగుల మేర ప్రవహిస్తున్నదని, మరో రెండు అడుగులు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు.
ప్రజలు అనవసరంగా ముంపు ప్రాంతాల్లో తిరగొద్దని, మున్నేరు నది, బ్రిడ్జిలపైకి రావొద్దని కోరారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు స్థానికంగా ఉంటూ.. మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ అనిల్‌కుమార్, అర్బన్ తహసీల్దార్ సైదులు, రూరల్ తహసీల్దార్ పి.రాంప్రసాద్, మున్సిపల్, పోలీస్, నీటిపారుదల శాఖల అధికారులు ఉన్నారు.