ఖమ్మం, జూలై 4 : మున్నేరు వరదలతో పరీవాహక ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు కార్యాచరణ పకడ్బందీగా రూపొందించాలని, ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టర్.. నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి నగరంలోని కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి, బొకలగడ్డ, వినాయక నిమజ్జన ఘాట్, ప్రకాశ్‌నగర్, జలగంనగర్ తదితర ప్రాంతాలను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రావోయే భారీ వర్షాలు, వరదల పట్ల ముందస్తు సన్నద్ధతపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాలు, ప్రమాదకర నీటి వనరుల పట్ల ముందస్తుగా మ్యాపింగ్ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎకడ ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయో గుర్తించి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. ఆపదమిత్ర కింద యువతీ యువకులను గుర్తించి విపత్తు నిర్వహణపై శిక్షణ ఇచ్చామని, గ్రామీణ ప్రాంతాల్లో 139, పట్టణ ప్రాంతాల్లో 161 మంది యువతను నియమించినట్లు తెలిపారు.
విద్యుత్ శాఖ అధికారులు ముంపు ప్రాంతాల్లో ఉన్న మేజర్ టవర్లకు ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నైట్లెతే ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలో 1077 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ పని చేస్తుందని తెలిపారు. గత ఏడాది భారీ వరదల నేపథ్యంలో జిల్లాలో మూడు నెలలపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా రిహాబిలిటేషన్ సెంటర్లను ముందుగా గుర్తించాలని, అవసరమైన పక్షంలో ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లను కూడా రిహాబిలిటేషన్ సెంటర్‌గా ఏర్పాటు చేయాలని సూచించారు. వరదల సమయం లో అవసరమైన బోట్లు, రోప్స్, లైఫ్ జాకెట్, మైక్స్, లైట్లు, జేసీబీ, క్లినింగ్ ఎక్విప్మెంట్ తదితర సామగ్రి డివిజన్, గ్రామాలవారీగా అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, ఆర్డీవో నరసింహారావు, సహాయ మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, తహసీల్దార్లు సైదులు, రాంప్రసాద్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ.శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో కుమార్, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.