కొత్తగూడెం గణేష్టెంపుల్, మార్చి 13 : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్యులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, ఔషదాల లభ్యత, పరిశుభ్రత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
ఔషధాల గదిని పరిశీలించి నిల్వ ఉన్న మందులను నిశితంగా పరిశీలించారు. మందుల ఎక్స్పైర్ తేదీని పరిశీలించి, గడువు తీరిన మందులను రోగులకు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం ఔట్ పేషెంట్ విభాగంలోని రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ను పరిశీలించారు. ప్రతి రోజు ఎంతమంది రోగులు వస్తున్నారని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.