KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు నర్సంపేటకు రానున్నారు. స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.
పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ, పార్టీ కోసం కృషి చేస్తూ, తన ముఖ్య అనుచరుడుగా కొనసాగిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో కేసీఆర్ విషాదంలో మునిగిపోయారు. ఈ క్రమంలో తన ఆప్తుని కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఆయన నర్సంపేట రానున్నారు. ఈ మేరకు, రేపు 9 ఆగస్టు ఆదివారం నాడు నర్సంపేట నియోజకవర్గంలోని పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి బయలుదేరి వెళ్ళనున్నారు.
ఈ సందర్భంగా, ఇంటి పెద్దను కోల్పోయి శోక తప్త హృదయులై వున్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి కష్ట కాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇదే సందర్భంలో, నర్సంపేట నియోజకవర్గం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు అధినేత కేసీఆర్ గుండె ధైర్యం ఇవ్వనున్నారు. కాగా, పెద్ది కుటుంబాన్ని ఆదుకునేందుకు తన విశాల హృదయాన్ని చాటుకున్న కేసీఆర్ గారు, ఇప్పటికే 2 కోట్ల 25 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం ప్రకటించారు.