రఘునాథపాలెం, జనవరి 11 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 15 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. నాలుగైదు రోజులుగా జిల్లా ప్రజలు చలిపులి గజగజా వణికిస్తోంది. జనాలు బయటకు రావడానికి జంకుతున్నారంటేనే చలి ఎంతలా వణికిస్తోందో అర్థమవుతోంది. సాయంత్రం నుంచి మొదలైన చలి మరుసటి రోజు మధ్యాహ్నం దాటినా తగ్గడం లేదంటే అతిశయోక్తి కాదు. పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఎండలో నిలబడి ఉపశమనం పొందుదామనుకుంటే ఐదారు రోజులుగా అసలు సూర్యుడు కన్పించనంతగా ఆకాశాన్ని మబ్బులు కమ్మేయడం గమనార్హం. దిత్వా తుపాను హెచ్చరికలను వాతావరణ శాఖ ఇటీవల చేసినప్పటికీ వారం రోజులుగా దాని ప్రభావం కన్పిస్తూనే ఉంది. చలి అమాంతం పెరిగిన నేపథ్యంలో జిల్లా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చలి తీవ్రత అమాంతం పెరగడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు చలికి వణికిపోతున్నారు. అయితే, మఫ్లర్ కట్టుకోవాలని, మంకీ క్యాప్ పెట్టుకోవాలని, చలికోట్లు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, చంటి పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు కూడా సూచనలు చేస్తున్నారంటే జిల్లాలో చలి తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు తమ ఇళ్లల్లో రూమ్ హీటర్లను అమర్చుకుంటుండగా.. మరికొందరు తమ ఇళ్లల్లోనే చలిమంట కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత వల్ల చాలామంది జలుబు, దగ్గు, జ్వరాల భారిన కూడా పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వారం రోజులగా వాతావరణంలో వస్తున్న మార్పుల ఆధారంగా చలిగాలులు వీస్తున్నాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి.
ముఖ్యంగా గత సోమవారం నుంచి చలి తన పంజాను విసురుతోంది. ఫలితంగా నగర వాసులతోపాటు మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉదయం సమయంలో బయటకు రావడం లేదు. గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. గత ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు ఉండగా శనివారం ఉదయం 17 డిగ్రీలకు చేరింది. శుక్రవారం, శనివారం రెండు రోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువ కావడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఏడాది చలి తీవ్రత ఇప్పటి వరకు పెద్దగా లేనప్పటికీ గడిచిన వారం రోజులుగా మాత్రం గజగజా వణికిస్తోంది. చలి కారణంగా ఉదయం పూట వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు రోజుల నుంచి చలి ఎక్కువ కావడంతో ఖమ్మం నగరంలోని అనేకమంది స్వెట్టర్ల దుకాణాలకు పరుగులు పెడుతున్నారు.
చలి తీవ్రత కారణంగా ఉదయం పనులకు వెళ్లే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ వాకింగ్ చేసే వారు కూడా వాకింగ్‌కు వెళ్లేందుకు జంకుతున్నారు. ఉదయం పూట పాఠశాలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతోపాటు కూరగాయల మార్కెట్‌కు వెళ్లే వ్యాపారులు కూడా చలి కారణంగా వణుకుతున్నారు. అంతేకాకుండా వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు స్వెట్టర్లు లేకుండా బయటకు రాని పరిస్థితి ఉంది. గ్రామాల్లో వ్యవసాయ పనుల నిమిత్తం చేల వద్దకు వెళ్లే రైతులు, కూలీలు కొంతమంది చలి కారణంగా తమ పనులను వాయిదా వేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
అంతేకాకుండా మూడు రోజుల నుంచి ఉదయం పూట మంచు సైతం పెద్ద ఎత్తున కురుస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. గత ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు ఉంది. ఐదురోజుల్లోనే ఉష్ణోగ్రతలలో మార్పులు చోటు చేసుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో చలిమంటలు వేసుకొని చలికాగుతున్నారు. అయితే, ఇలాంటి చలి కారణంగా శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.