ఖమ్మం రూరల్, నవంబర్ 13 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో గజగజ వణుకు మొదలైంది. చిన్నారులు, వృద్ధులు ఇంకాస్త వణికి పోతున్నారు. రాత్రి నుంచి ఉదయం 10 గంటలకు వరకు చలి తీవ్రత అధికంగా ఉంటుంది. అదే సమయంలో మధ్యాహ్నం వేళ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదైంది. దీంతో ఉదయం, రాత్రి వేళల్లో జిల్లా ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, విధుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసే ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, రోగులు చలి తీవ్రతను తట్టుకోలేపోతున్నారు.
నవంబర్ రెండో వారం ప్రారంభమైందో లేదో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాబోయే వారం రోజులపాటు మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చలి కూడా తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. మొంథా తుపాను కారణంగా సరిగ్గా పది రోజుల క్రితం భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. అది తగ్గిందో లేదో చలి పంజా విసరడం మొదలుపెట్టింది. సాధారణంగా ఏ కాలమైనా తన ప్రభావాన్ని అంచెలంచెలుగా చూపిస్తూ తీవ్రతరంగా విస్తరిస్తుంది.
అయితే ఈ సీజన్లో వానకాలంలో ఆరంభమైన వర్షాలు అక్టోబర్ నెల వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిందే తరువాయి అన్నట్లుగా నవంబర్ రెండో ప్రారంభం కాగానే చలి తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది. అక్టోబర్ చివరి వరకు 30 డిగ్రీలకు పైగానే నమోదైన ఉష్ణోగ్రతలు వారం రోజుల వ్యవధిలోనే 18 డిగ్రీల కనిష్టానికి పడిపోయాయి. గ్రామాల్లో ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటనల ప్రకారం మరో వారం కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. దీంతో జిల్లాలోనూ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. పొరుగు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలూ నమోదయ్యే అవకాశం లేకపోలేదు. చలి తీవ్రత పెరుగుతుండడంతో జిల్లా ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. చలి మంటలతోనూ ఉపశమనం పొందుతున్నారు. ఉదయం వేళ ఎండ వచ్చే వరకు చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా వ్యాధి గ్రస్తులు బయటకు రాకపోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కొద్ది రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఎక్కువగా బయటకు రాకపోవడం మంచిది. చిన్నారులకు జలుబు, దగ్గు, న్యూమోనియా వంటి వ్యాధులు వ్యాప్తిచెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలను ఉదయం పూట బయటికి తీసుకురావొద్దు. శరీరం వేడిగా ఉండేందుకు షెట్టర్లు, చేతులు, కాళ్లకు గ్లౌజులు ధరించాలి. పెద్ద వయస్సు వారు, ఆస్తమాతో బాధపడే వారికి ఈ చలి చాలా ప్రమాదకరం. ఎక్కువగా శ్వాసకోస ఇబ్బందులు, గుండె ఆగిపోవడం, పక్షవాతం వంటి వాటితో ప్రాణాపాయం ఏర్పడవచ్చు. చలికాలంలో రాత్రిపూట ప్రయాణాలు మానుకుంటే మంచిది. అన్నివేళలా వేడి వేడి ఆహార పదార్థాలు భుజించాలి. ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని నీటినే సేవించాలి. ఆహారంలో పండ్లు ఎక్కువగా తీసుకుంటూ.. నిత్యం జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
-డాక్టర్ వరికూటి సుబ్బారావు, సీనియర్ పల్మనాలజిస్ట్, ఖమ్మం