ఖమ్మం రూరల్, జూన్ 13 : తెలంగాణలోని ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని బైపాస్‌రోడ్‌లో గల టీసీవీ ఫంక్షన్ హాల్లో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ముఖ్యఅతిథులుగా హాజరుకాగా.. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన అంగన్వాడీ టీచర్లు బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికారు. అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. అనంతరం సభా వేదిక వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న పలువురు మహిళలకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలు, మెమోంటోలతో సత్కరించారు. స్త్రీనిధి పథకం ద్వారా మంజూరైన చెక్కులను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందజేశారు. అనంతరం ఎంపీడీఓ వీడీవీ అశోక్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కందాళ మాట్లాడారు. ప్రతీ మహిళ సుఖసంతోషాలతో, పూర్తి ఆరోగ్యంగా జీవించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంక్షేమం కోసం అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ సాధనకు ముందు, ప్రస్తుతం మహిళా సంక్షేమంపై బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. వారంలో రోజుల్లో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు పేట్లు, గ్లాసులు కందాళ ట్రస్టు ద్వారా అందిస్తామన్నారు.
మహిళల మోములో చిరునవ్వే సీఎం లక్ష్యం: ఎమ్మెల్సీ తాతా మధు
ప్రతీ మహిళ మోములో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. మహిళా పక్షపాతి సీఎం కావడం వల్లనే నేడు అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. నాటి పాలనలో అంగన్వాడీలు తమకు కనీస గౌరవంతోపాటు వేతనాలు ఇవ్వాలని కోరిన పాపానికి గుర్రాలతో తొక్కించి, లాఠీచార్జ్ చేయించిన ఘనత ఆనాటి పాలకులదన్నారు. మరోసారి సీఎం కేసీఆర్‌ను, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, ఎంపీపీలు బెల్లం ఉమా, వజ్జా రమ్య, మంగీలాల్, బానోత్ శ్రీనివాస్, జడ్పీటీసీలు యండపల్లి వరప్రసాద్, ఇంటూరి బేబి, నేలకొండపల్లి ఏఎంసీ చైర్పర్సన్ నంబూరి శాంత, డీఆర్డీఏ పాలేరు డివిజన్ అధికారి రేవతి, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు ఇంటూరి శేఖర్, చావా వేణు, రూరల్ తహసీల్దార్ టీ సుమ, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఐసీడీఎస్ పర్యవేక్షకులు, ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు, ఆత్మ కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.