‘మీ ఓటుతో అసెంబ్లీ గుమ్మంలోకి ఎమ్మెల్యేగా పాలేరు బిడ్డను పంపిస్తే నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు పథకం వర్తింపజేస్తాం. నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. వారి బాగోగులు తెలుసుకుంటూ ఆపదలో ఆదుకునే కందాళ ఉపేందర్‌రెడ్డికి శాసనసభ ఎన్నికల్లో పట్టం కట్టండి.. అక్కున చేర్చుకోండి. ఆయన మళ్లీ మీకు సేవచేసే భాగ్యం కల్పించండి..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జీళ్లచెరువు వద్ద శుక్రవారం పాలేరు ఎమ్మెల్యే, అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రజల మనిషి ‘కందాళ’ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
‘ఖమ్మం జిల్లాలో బహురూపులైన నాయకులిద్దరూ పాలేరు నుంచి పోటీ చేయాలని చూస్తుంటరు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తొక్కనీయమంటరు.. ప్రజలు తలుచుకుంటే వాళ్ల సంగతేంటి..? దుమ్ములేపరా.? నాలుగు పైరవీలు.. నాలుగు కాంట్రాక్టులు చేసుకుని.. డబ్బులు సంపాదించి.. ఆ డబ్బు మదంతో ప్రజలనే కొంటాం.. ప్రజాస్వామ్యాన్నే కొంటాం అని అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నరు.. ఇది రాజకీయమా..? కోట్లకు కోట్లు డబ్బు ఖర్చు పెట్టి.. ప్రజల ఓట్లు పొంది ఆ తర్వాత ఏమార్చి అవే చేతులు కడుపులో పెట్టి పేగులు బయటకు తీస్తరు.. వాళ్ల మాటలు నమ్మితే దెబ్బతింటం. ఎటూ కాకుండా పోతం..’
‘తుమ్మల 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో మూలకు కూర్చున్నరు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పాత స్నేహాన్ని గుర్తుంచుకొని తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చిన. ఎమ్మెల్సీగా గెలిపించిన. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అప్పగించి ఏకఛత్రాధిపత్యం ఇస్తే తుమ్మల పార్టీకి చేసింది గుండు సున్న. తుమ్మల రెండు జిల్లాల నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిపించలేకపోయారు. బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిండా.. తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా.. అని ఒక్కసారి ఆలోచించాలి’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘వచ్చే శాసనసభ ఎన్నికల్లో పాలేరు అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి.. అసెంబ్లీ గుమ్మంలోకి పంపిస్తే నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు పథకం వర్తింపజేస్తాం. పూర్తిగా ఆ బాధ్యత నాదే. ఉపేందర్‌రెడ్డి సౌమ్యుడు, ప్రజా సేవకుడు. ఆయన ఉపన్యసించిన తీరు ఆకట్టుకుంది. ఇంత పెద్ద సభలో ప్రసంగంలా కాకుండా.. తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లుగా ఉంది. ఆపదొస్తే నేనున్నానని.. నా ఫోన్ నంబర్ ఉందా.. అని అడిగే నాయకుడు ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కందాళ పనితీరును కొనియాడారు.
ఖమ్మం, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి కోరిక మేరకు నియోజకవర్గానికి చెందిన ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు ఇచ్చే బాధ్యత నాది’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అని ప్రకటించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెర్వు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి సౌమ్యుడు, ప్రజాసేవకుడని కొనియాడారు. కందాళ ఉపన్యసించిన తీరు తనను ఆకట్టుకుందన్నారు. ఇంత పెద్ద సభలో ప్రసంగంలా కాకుండా తన కుటుంబసభ్యులతో మాట్లాడినట్లుగా ప్రజలతో మాట్లాడరాన్నరు. ‘ఆపద వస్తే నేనున్నాను.. నా ఫోన్ నెంబర్ మీ వద్ద ఉందా..?’ అని ప్రశ్నించడం తనకు నచ్చిందన్నారు. ప్రజల మనిషిగా పనిచేస్తున్న కందాళను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
డబ్బు కట్టలు దండిగా ఉన్న నేతల మాటలు ప్రజలు నమ్మొద్దని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలను ఏమార్చి ఓట్లు కొల్లగొడితే వారు గెలుస్తారు కానీ ప్రజలు ఓడిపోతారన్నారు. ఇక అభివృద్ధికి తావు ఉండదన్నారు. రాజకీయంగా చైతన్యవంతులైన పాలేరు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న పాలేరు నుంచి ఎంతో కమ్యూనిస్టు నాయకులు ప్రజాప్రతినిధులయ్యారన్నారు. ప్రజలు వాళ్ల హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చెందిందో.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందిందో బేరీజు వేసుకోవాలన్నారు. అవకాశాలు, పదవులు లేని కొందరు పార్టీలు మారతారని, ప్రజల మధ్యకు వచ్చిన నరం లేని నాలుకలతో ఏది పడితే అది మాట్లాడతారన్నారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. పాలేరు ప్రాంతాన్ని కరువు కోరల నుంచి బయటకు తీసుకువచ్చామన్నారు. ఇదే విషయాన్ని ఇక్కడ పుట్టి పెరిగిన మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా తనతో ప్రస్తావించారని, పథకాన్ని ప్రారంభించిన సమయంలో ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని సంబురపడ్డారని గుర్తుచేశారు. గత పాలకులు పాలేరు ప్రజలకు చేసిందేమీలేదన్నారు. కనీసం మంచినీరు, సాగునీరు ఇవ్వాలన్న ఆలోచన కూడా వారు చేయలేదన్నారు. నియోజకవర్గంలోని చెరువులు ఇప్పుడు నిండు వేసవిలోనూ నిండుకుండలను తలపిస్తాయన్నారు. పాలేరుకు నీళ్లిచ్చినా, అభివృద్ధి ఇచ్చినా అది కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు.
తెలంగాణ ఇస్తానని ఇవ్వకుండా నాడు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే తాను ఆమరణ దీక్షకు దిగానని, నాటి పాలకులు తనను తీసుకొచ్చి ఖమ్మం జైలులో పెట్టారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. నాడు ఖమ్మం ఉద్యమానికి అండగా నిలిచిన తీరు తాను మరువలేదన్నారు. తెలంగాణకు ముందు పాలేరు ప్రాంతంలో ఎకరా భూమి విలువ రూ.4 లక్షలు ఉన్నా ఎవరూ కొనేవారు లేకపోయారన్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల నిర్మించిన తర్వాత ఇప్పుడు అదే భూమి విలువ రూ.40 లక్షలకు చేరుకున్నదన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. రైతుబంధు పథకాన్ని అమలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబారా ఖర్చు అంటూ తెలిసీ తెలియని మాటలు మాట్లాడారన్నారు. కానీ అదే పథకాన్ని హరితవిప్లవ సృష్టికర్త, సైంటిస్ట్ ఎంఎస్ స్వామినాథన్‌తోపాటు యూఎన్వో సైతం ప్రశంసించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అభివృద్ధి కోరుకునేవారు బీఆర్ఎస్కు అండగా ఉండాలన్నారు. త్వరలో సీతారామా ప్రాజెక్టు పనులు పూర్తికానున్నాయని, ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమువుతుందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ పార్టీ రైతుబంధు, దళితబంధుకు రాం రాం అంటుందన్నారు. ప్రజల పరిస్థితి వైకుంఠపాళి ఆటలో పెద్దపామును మింగినట్లవుతుందన్నారు.
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో ద్వితీయ స్థానంలో నిలుస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ ఇక్కడి ప్రజలు దొడ్డు బియ్యం తినడం తనకు నచ్చడం లేదన్నారు. ఎన్నికల గెలిచిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 93 లక్షల నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తామన్నారు. గిరిజనులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది.. దశాబ్దాలుగా పోడు సాగు చేస్తున్న వారికి పట్టాలు అందజేసింది.. ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. సభలో రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, వైరా శాసనసభ్యులు రాములు నాయక్, వైరా బీఆర్ఎస్ అభ్యర్ధి బానోత్ మదన్‌లాల్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, పార్టీ నాయకులు యాతాకుల భాస్కర్, ఉప్పల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
మంచి మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన విజన్‌తోనే నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. నాకు రాజకీయాలకంటే ప్రజల సంక్షేమమే ముఖ్యం. నేను నిత్యం ప్రజల మధ్య ఉంటున్నా.. వారితో కలిసి పని చేస్తున్నా.. ప్రజల్లో ఒకడిగా ఉంటున్నా. ప్రజలు ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయవచ్చు. నా ఫోన్ నెంబర్ ప్రజలందరికి వద్ద ఉండాలి. పాలేరు నియోజకవర్గంలో ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు. వారందరికీ దళితబంధు వర్తింపజేయాలి. సీఎం కేసీఆర్ అందుకు అనుకూలంగా స్పందించాలి. తిరుమలాయపాలెం, రూరల్ మండలాలను విభజించి పాలేరులో మరో రెండు కొత్త మండలాలు ఇవ్వాలి. కూసుమంచి పీహెచ్‌సీని 50 పడకలను అప్‌గ్రేడ్ చేయాలి. పాలేరును రెవెన్యూ డివిజన్‌గా మార్చాలి. నేను పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలి. ప్రజలు మరోసారి నన్ను ఎన్నికల్లో గెలిపించాలి. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి
డబ్బుందన్న అహంకారపూరిత రాజకీయాలు..
“ఖమ్మం జిల్లాలో ఇద్దరు బహురూపులైన నాయకులు ఉన్నరు. వారికి డబ్బుందున్న అహంకారం. డబ్బుతో మేము ఎవరినైనా కొనగలం.. ఏదైనా చేయగలం అనుకుంటరు.. వాళ్లిద్దరూ పాలేరు నుంచి పోటీ చేయాలని చూస్తుంటరు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తొక్కనీయమంటరు.. ప్రజలు తలుచుకుంటే అన్నవాళ్ల సంగతేంటి..? దుమ్ములేపరా.? నాలుగు పైరవీలు.. నాలుగు కాంట్రాక్టులు చేసుకుని.. డబ్బులు సంపాదించి.. ఆ డబ్బు మదంతో ప్రజలనే కొంటాం.. ప్రజాస్వామ్యాన్నే కొంటం అని అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నరు.. ఇది రాజకీయమా..? కోట్లకు కోట్లు డబ్బు ఖర్చు పెట్టి.. ప్రజలు ఓట్లు పొంది ఆ తర్వాత ఏమార్చి అదే చేతులు కడుపులో చేతులు పెట్టి పేగులు బయటకు తీస్తరు.. వాళ్ల మాటలు నిమ్మితే దెబ్బతింటం.. ఏటూ కాకుండ పోతం..” అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి అన్నారు.
‘మాజీ మంత్రి తుమ్మలకు నేను అన్యాయం చేసినట్లు ఆయన బయట ప్రచారం చేస్తున్నరు.. తుమ్మల 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో మూలకు కూర్చున్నరు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పాత స్నేహాన్ని గుర్తుంచుకుని తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చిన. ఎమ్మెల్సీగా గెలిపించిన. నాటి ఎమ్మెల్యే వెంకటరెడ్డి హఠాన్మరణం చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. మేం వెంకటరెడ్డి భార్యకు సీటు ఇద్దాం అనుకున్నం. కానీ తుమ్మల నా వద్దకు వచ్చి ‘నా నియోజకవర్గం రిజర్వ్ అయింది. పాలేరు నుంచి పోటీ చేసి, గెలిచి ప్రజలు సేవ చేస్తా..’ అని అడిగితే మేం ఒప్పుకున్నం. ప్రజలు తుమ్మలకు 40,000 ఓట్ల మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని కట్టబెట్టారు. ఇదంతా ప్రజలకు తెలుసు. నేను ఉమ్మడి ఖమ్మం జిల్లాను అప్పగించి ఏకఛత్రాధిపత్యం ఇస్తే తుమ్మల పార్టీకి చేసింది గుండు సున్న. తుమ్మల రెండు జిల్లాల నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిపించలేకపోయారు. బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిండా.. తుమ్మలకు బీఆర్ఎస్కు అన్యాయం చేసిందా.. అని ఒక్కసారి ఆలోచించాలి.. నోరుంది కాదా అని తుమ్మల నాతోపాటు మంత్రి అజయ్, ఎంపీ నామాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు..’ అన్నారు.