ఉద్యమ గుమ్మం.. ఖమ్మం మరో చరిత్రకు నాంది పలకనున్నది. తెలంగాణ జైత్రయాత్ర సాగించిన పోరు భూమి మరో సమర నినాదానికి సిద్ధమైంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడి.. యావత్ దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించాలనే సంకల్పానికి బీజం పడనున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరించిన తర్వాత బీఆర్ఎస్ మొట్టమొదటి బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబైంది.. ఉద్యమాల గడ్డపై గులాబీ సైన్యం కవాతు చేయనున్నది. ఖమ్మం శివారులోని వీ వెంకటాయపాలెం వద్ద బుధవారం జరిగే భారీ బహిరంగ సభ జాతీయ రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్నది.
ఈ సభకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సహా ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, విజయన్, భగవంత్‌మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు హాజరుకానున్నారు. దీంతో దేశం దృష్టి బీఆర్ఎస్ సభపైనే కేంద్రీకృతమైంది. యావత్ భారతావని సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. కాగా, ఖమ్మం నగరం గులాబీ జెండాలతో శోభాయమానంగా కనిపిస్తున్నది. భారీ కటౌట్లపై ప్రభుత్వ పథకాల కొటేషన్లు, బీఆర్ఎస్ నినాదాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. లక్షలాదిగా తరలిరానున్న సభ కోసం పక్కా ప్రణాళికతో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు.
ఖమ్మం, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం వేదికగా పోరు జెండా ఎగురనున్నది. ఢీల్లీ పీఠం దద్దరిల్లేలా బీఆర్ఎస్ గర్జించనున్నది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నది. చరిత్రలో నిలిచిపోయేలా సభ విజయవంతం కానున్నది. మతం పేరిట, కులం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీని పడగొట్టి కేంద్రంలో లౌకిక, ప్రజాస్వామ్య విలువలతో కూడిన ప్రభుత్వ ఏర్పాటుకు సభ నాంది పలకనున్నది. పార్టీ మొట్టమొదటి మహాసభకు ఖమ్మం శివారులోని వీ వెంకటాయపాలెం పరిధిలోని వందెకరాల సభా వేదిక సిద్ధమైంది. ఏర్పాట్లను సభ ఇన్చార్జి, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యవేక్షించి పూర్తి చేయించారు. బుధవారం జరిగే ఈ సభకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో పాటు కేరళ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు పినరాయి విజయన్, భగవంత్ మాన్, కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా, సీపీఎం, సీపీఐ జాతీయ, రాష్ట్ర నేతలు హాజరై సభనుద్దేశించి మాట్లాడనున్నారు.
సభాస్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరిశ్‌రావు, ఎంపీ నామా, ఎమ్మెల్సీలు పల్లా, కౌశిక్‌రెడ్డి
పూలతో అలంకరించిన కలెక్టరేట్ ప్రధాన ద్వారం
ప్రారంభోత్సవం.. సభ సాగుతుందిలా..
మధ్యాహ్నం 1:10 గంటలకు రెండు హెలీకాఫ్టర్లలో సీఎం కేసీఆర్‌తో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు, ముఖ్యఅతిథులు ఖమ్మం సమీకృత కలెక్టరేట్లోని హెలీప్యాడ్‌లో ల్యాండ్ అవుతారు. తొలుత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. కలెక్టరేట్లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌ను తన చాంబర్లో కూర్చోబెడతారు. అనంతరం రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. విందు తర్వాత నూతన కలెక్టరేట్ వెనుక ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమవుతుంది. సభ సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు హెలికాఫ్టర్‌లో బయల్దేరుతారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హెలీకాఫ్టర్లో ఏపీలోని విజయవాడకు వెళ్తారు.
సభ నుంచే జాతీయ రాజకీయాలు షురూ..
బీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా జరిగే సభ ఇదే కావడంతో ఈ సభ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. సభ జాతీయ మీడియాను ఆకర్షిస్తున్నది. యావత్ దేశ ప్రజలు సభ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారు.. కేంద్రంలోని బీజేపీకి ఏవేం సవాళ్లు విసురుతారోనని అని ఎదురుచూస్తున్నారు. మున్ముందు బీఆర్ఎస్ అనుసరించే రాజకీయ విధానాలపై సభ ద్వారానే స్పష్టత రానున్నది. సభ ఉత్తర, దక్షిణ భారతాలకు వారధిగా నిలుస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సభపైనే దృష్టి కేంద్రీకరించాయి. ఒక విధంగా ఈ సభ బీఆర్ఎస్ బలప్రదర్శన కానున్నది. దేశంలో బీజేపీయేతర పార్టీల బలానికి, బీఆర్ఎస్ నిర్మాణ శక్తికి వేదికగా సభ నిలువనున్నది. సభతో ఎస్పీ, ఆప్, సీపీఐ, సీపీఎం సహా అనేక పార్టీలను ఏకం చేసిన కేసీఆర్ సత్తా యావత్ భారత ప్రజలను ప్రభావితం చేయనున్నది. సభకు తరలివచ్చే లక్షలాది మంది ప్రజల మద్దతును యావత్ దేశం వీక్షించనున్నది.
ఉద్యమాల ఖిల్లా.. ఖమ్మం జిల్లా..
మొదటి నుంచి రాజకీయ చైతన్యం గల జిల్లా ఖమ్మం జిల్లా. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో మహోజ్వల ఘట్టాలు ఇక్కడ ఆవిష్కృతమయ్యాయి. 1969 జనవరి 8న కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి ఖమ్మంలో అప్పటి డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్ రెండు వారాలు ఆమరణ దీక్ష చేపట్టడం అప్పట్లో ఓ సంచలనం.2002 నంబంబర్ 17న ఖమ్మంలో ఉద్యమ నేత కేసీఆర్ నిర్వహించిన ‘ప్రజాగర్జన’, 2006 ఫిబ్రవరి 12న నిర్వహించిన ‘పోలవరం గర్జన’కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2009 నవంబర్ 23న ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ నిరాహార దీక్షను నాటి పాలకులు భగ్నం చేసి ఆయన్ను ఖమ్మం జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన్ను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించేంత వరకు ప్రజలు అండగా నిలబడ్డారు. కేసీఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇక్కడ మొదలైన ఉద్యమ సెగ రాష్ట్రవ్యాప్తంగా అంటుకున్నది. అందుకే కేసీఆర్‌కు ఖమ్మం జిల్లాపై ప్రత్యేక అభిమానం. జిల్లా రెండుగా విడిపోయిన తర్వాత అభివృద్ధి పనులకు విరివిగా నిధులు విడుదల చేశారు. తాజాగా బీఆర్ఎస్ మొట్టమొదటి సభను ఖమ్మంలోనే నిర్వహించాలనుకున్నారంటే జిల్లాపై ఉన్న ఆయనకున్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు.