పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జీళ్లచెరువులో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ‘జన’ పరవళ్లు తొక్కింది. దారులన్నీ సభా ప్రాంగణానికి బారులు తీయడంతో బీఆర్ఎస్పై ఉన్న అభిమానం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం తొలి ఎన్నికల ప్రచార సభ కావడంతో నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాలతోపాటు పొరుగు నియోజకవర్గాల నుంచీ బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. సీఎం రాక సందర్భంగా సభా ప్రాంగణాన్ని సర్వహంగులతో ముస్తాబు చేయడం.. గులాబీ జెండాలు, భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడం.. దీనికి జనం తోడు కావడంతో సభా స్థలం జాతరను తలపించింది. సీఎం కేసీఆర్ సభ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభంకావాల్సి ఉండగా.. రెండు గంటలు ఆలస్యం కావడంతో తరలివచ్చిన జనమంతా ఎండను సైతం లెక్క చేయకుండా ఓపికతో ఎదురుచూసి.. శ్రద్ధగా సీఎం ప్రసంగం విన్నారు. సభా ప్రాంగణం కిక్కిరిపోవడంతో రోడ్లపై ప్రజలు ఎక్కడికక్కడే నిలిచి ప్రసంగం వినేందుకు ఆసక్తికనబరిచారు.. సీఎం కాంగ్రెస్, బీజేపీ నేతలపై చేసిన విమర్శలకు ప్రజలు చప్పట్లు కొట్టారు. కేరింతలు కొట్టారు.. ఈలలు వేశారు. సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొన్నది. సభ ఆద్యంతం ‘జై కేసీఆర్… జై బీఆర్ఎస్’ నినాదాలతో కొనసాగింది.
కూసుమంచి, అక్టోబర్ 27 : కూసుమంచి మండలం జీళ్లచెరువులో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు హెలీప్యాడ్ వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ ఉన్నారు. సీఎం సెక్యూరిటీ అధికారి షెహనవాజ్ ఖాసీం, సీపీ విష్ణు ఎస్ వారియర్, ఏసీపీలు బస్వారెడ్డి, రామానుజం, గణేశ్, సారంగపాణి బందోబస్తు నిర్వహించారు. 400 మంది పోలీసులతో సీఎం సభకు బందోబస్తు నిర్వహించారు.
సీఎం వేదికపైకి రాగానే ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తెలు దీపిక, దీప్తి, అల్లుడు సురేందర్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. జడ్పీ వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి, ఆత్మ చైర్మన్ రామసహాయ బాలకృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఎంపీపీలు బెల్లం ఉమ, బానోత్ శ్రీనివాస్, వజ్జా రమ్య, బోడా మంగీలాల్, జడ్పీటీసీలు ఇంటూరి బేబీ, వరప్రసాద్, పార్టీ వివిధ మండలాల వేముల వీరయ్య, బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, పాషబోయిన వీరన్న, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను వేదిక మీద సీఎంకు పరిచయం చేశారు.
కూసుమంచి/ఖమ్మం రూరల్, అక్టోబర్ 27: సభా ప్రాంగణం పక్కనే పార్కింగ్ ప్రదేశాలు ఉండడంతో నాలుగు మండలాల నుంచి వాహనాల్లో వచ్చిన ప్రజలకు నడక ప్రయాస తప్పింది.